పప్పు ధాన్యాల ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. నెల కిందటితో పోలిస్తే క్వింటాలుకు ఏకంగా రూ.1000 నుంచి రూ.1,500 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ పరిణామంతో తమకు ఒరిగేదీ ఏమీ లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. వారు ఫిబ్రవరి, మార్చి నెలల్లోనే మద్దతు ధరలు, అంతకంటే తక్కువకే దిగుబడులన్నీ అమ్మేయడమే ఇందుకు కారణం. మరోవైపు వినియోగదారులపై మాత్రం ఊహించని భారం పడుతోంది. కరోనా నేపథ్యంలో పేదలకు కేంద్రం రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, సెనగలు, బియ్యం ఉచితంగా ఇస్తోంది. రాష్ట్రంలో నెలలో ఒకసారి కిలో కందిపప్పు, మరోసారి కిలో సెనగలు ఇస్తున్నారు. అదే సమయంలో రేషన్ కార్డులు లేని మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలలోనూ పప్పుల వినియోగం భారీగా పెరిగింది.
ఈ ప్రభావం పప్పుధాన్యాల ధరలపైనా పడింది. కందులకు కేంద్ర మద్దతు ధర క్వింటాలుకు రూ.6వేలు ఉంటే... ప్రస్తుతం రూ.7,500 నుంచి రూ.8వేల వరకు చేరింది. మహారాష్ట్రలో రూ.6,580, కర్ణాటకలో కొన్నిచోట్ల గరిష్ఠంగా రూ.8,500 నుంచి రూ.9వేల వరకు పలుకుతుండటం గమనార్హం.
పాత నిల్వలకూ గిరాకీ
కందులకు ధర పెరగడంతో పాత నిల్వలకూ గిరాకీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ మార్క్‌ఫెడ్ వద్ద రెండేళ్ల కిందటి కందులు 11 వేల టన్నుల వరకు ఉన్నాయి. నాణ్యంగా లేవంటూ పౌరసరఫరాల శాఖ అప్పట్లో వీటిని తిరస్కరించింది. మార్కెట్లో అమ్మేందుకు గతంలో టెండర్లు పిలవగా క్వింటా రూ.3,200 చొప్పున అడిగారు. వేచి చూస్తుండగానే ధరలు పెరిగాయి. క్వింటా రూ.5,600 వరకు పలకడంతో రూ.25 కోట్ల వరకు లాభం వచ్చింది.
* సెనగలకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.5,100. ప్రస్తుతం రూ.5,400 నుంచి రూ.6వేల వరకు పలుకుతోంది. మినుములు, పెసల ధరలు సైతం క్వింటాలుకు రూ.7,500 నుంచి రూ.8వేల వరకు చేరడం గమనార్హం.
* నిత్యావసర వస్తువుల చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. వస్తువుల నిల్వలపై పరిమితి తొలగించడంతో... పప్పు ధాన్యాల కొనుగోలుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
* రైతులు సాగు చేసిన పంటలు జనవరి నాటికి చేతికొచ్చే అవకాశముంది. ప్రస్తుతం మినుములనే దిగుమతి చేసుకుంటున్నారు. పైగా మన దేశంలో భారీ వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ధరల పెరుగుదలకు ఇదీ ఒక కారణమే.
కరుగుతున్న నాఫెడ్ నిల్వలు
* నాఫెడ్ ద్వారా 2018-19 సంవత్సరంలో 41.75 లక్షల టన్నులు, 2019-20లో 15.64 లక్షల టన్నులు, 2020-21లో 21.56 లక్షల టన్నుల పప్పుధాన్యాలు సేకరించారు.
* సేకరించిన వాటిలో సెనగలు, కందులే అధికం. వీటిని పేదలకు అందిస్తుండటంతో నాఫెడ్ వద్ద నిల్వలు తగ్గాయి.
* విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో సెప్టెంబరులో కందిపప్పు కిలో టోకున రూ.96 ఉంటే.. ఇప్పుడు రూ.112 అయింది.
* కిలో కందిపప్పు నెల్లూరులో రూ.120దాకా ఉంది.
* సెనగపప్పు రూ.80 వరకు పలుకుతోంది.
* పెసర పప్పు శ్రీకాకుళంలో రూ.130 వరకు ఉంది.
* మినప గుళ్లు విశాఖపట్నంలో రూ.120 వరకు ఉన్నాయి.
ఇదీ చదవండి: