పురపాలక ఎన్నికలతో తాత్కాలికంగా వాయిదాపడిన కొత్త ఆస్తిపన్ను విధానం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రభుత్వం చెప్పిన వెంటనే అమలు చేసేలా అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతపురం నగరపాలక సంస్థ తాజాగా జారీ చేసిన డ్రాఫ్టు నోటిఫికేషన్ ఇందుకు నిదర్శనం. అద్దె విలువ ఆధారంగా ఆస్తిపన్ను విధింపు విధానం నుంచి మూలధన విలువపై పన్ను వేసి 2021 ఏప్రిల్ నుంచి అమలు చేయాలని పురపాలకశాఖ తొలుత నిర్ణయించింది. పట్టణ స్థానిక సంస్థలకు మార్చిలో ఎన్నికలు జరగడం, ఏప్రిల్ నుంచి కొత్త పన్నుల విధానం అంటే ప్రజల్లో నుంచి విమర్శలొస్తాయని తాత్కాలికంగా పక్కన పెట్టారు.
ఈ ఏడాది (2021-22) మళ్లీ పాత పద్ద్ధతిలోనే ఒకవైపు పన్నులు వసూలు చేస్తూనే.. ఇంకోవైపు మూలధన విలువపై పన్ను వేసే విధానంపై ప్రజల నుంచి అభ్యంతరాలు సేకరిస్తున్నారు. గత నెల 29న అనంతపురం నగరపాలక సంస్థకు సంబంధించి డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీ చేశారు. మూలధన విలువపై నివాస భవనాలకు సంవత్సరానికి 0.15%, నివాసేతర భవనాలకు 0.30%, ఖాళీ స్థలాలకు 0.50% పన్ను విధిస్తున్నట్లు నగరపాలక సంస్థ వెల్లడించింది.
ప్రక్రియ పూర్తిచేసే క్రమంలో...
కొత్త ఆస్తిపన్ను విధానం అమలుకు పురపాలకశాఖ ఆదేశాలపై ఈ ఏడాది ఆరంభం నుంచే పట్టణ స్థానికసంస్థల్లో ఏర్పాట్లు చేశారు. పుర, నగరపాలక, నగర పంచాయతీ స్థాయిలో ముసాయిదా రూపొందించి, ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అప్పట్లో పాలకవర్గాలు లేనందున ప్రత్యేక అధికారి ఆమోదంతో ప్రాపర్టీ టాక్సుబోర్డు (పీటీబీ) పరిశీలనకు పంపారు. బోర్డు సూచనలతో పట్టణ స్థానిక సంస్థలు మరోసారి డ్రాఫ్టు నోటిఫికేషన్ జారీచేసి ప్రజల నుంచి రెండోసారి అభ్యంతరాలు స్వీకరించాలి. వీటి ఆధారంగా కమిషనర్లు తుది నోటిఫికేషన్ ఇస్తారు.
ఇదీ చదవండి: