కొద్ది రోజుల్లో తల్లిని కాబోతున్నాననే ఆ గర్భిణీ సంతోషం.. ఆరు నెలలకే ఆవిరైంది. వైద్య పరీక్షల కోసం ఆమెను వాగు దాటించినా.. కడుపు పంట నిలవకపోవడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరయింది. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం వెలుబెల్లిలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన మొరళి సరిత ఆరు మాసాల గర్భిణీ. సోమవారం కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 31 కి.మీ. దూరంలోని నర్సంపేట ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఏకధాటి వర్షాలకు గ్రామ రహదారి లోలెవల్ కాజ్‌వేపై నుంచి కత్తెర వాగు నిండుగా ప్రవహిస్తోంది. సరిత కుటుంబసభ్యులు సమస్యను సర్పంచి వెంకటలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ట్రాక్టర్‌లో గర్భిణిని వాగు దాటించారు.
అక్కడి నుంచి ఆటోలో తరలించగా కొత్తగూడ సమీపంలోని వాగులు ప్రవహిస్తుండడంతో గుంజెడు మీదుగా గూడూరు మండలం భూపతిపేట నుంచి నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ సరితకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కడుపులో బిడ్డ చనిపోయిందంటూ పిండాన్ని తొలగించినట్లు బంధువులు తెలిపారు. కష్టపడి వాగును దాటినా.. బిడ్డ దక్కలేదంటూ కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. లోలెవల్ కాజ్‌వేపై వంతెన నిర్మిస్తే 108 వాహనం నేరుగా గ్రామానికి వచ్చేదని.. ఇలాంటి కష్టం కలగకపోయేదని ఆవేదన చెందారు.
ఇవీ చూడండి..