Aqua farmers problems: నేను ఉన్నాను.. నేను విన్నాను అన్న జగన్.. అధికారంలోకి రాగనే ఇచ్చిన హామీలను మరిచిపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్నిటిలాగే.. ఆక్వా రైతులకు విద్యుత్తు రాయితీపైనా ప్రభుత్వం నాలుక మడతేసింది. అందరికీ యూనిట్ రూపాయిన్నరకే ఇస్తామన్న నిర్ణయాన్ని సవరిస్తూ.. పెద్దఎత్తున బాదుడు మొదలు పెట్టింది. అయిదెకరాల లోపు సాగుదారులకే రాయితీ అని పరిమితి విధిస్తూ.. అంతకు మించిన రైతులందరి నుంచి యూనిట్‌కు 3రూపాయిల 85 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.
ఇదే సమయంలో ఆక్వా రైతులకు ప్రభుత్వం యూనిట్ విద్యుత్తును రూపాయిన్నర చొప్పున రెండేళ్లపాటు రాయితీ ఇచ్చిన విషయాన్ని మరిచింది. ఏడాదికి రూ.780 కోట్ల చొప్పున రూ.15వందల 60 కోట్లు ఇచ్చామని గతేడాది నవంబరులో సీఎం జగన్ అసెంబ్లీలో స్వయంగా వెల్లడించారు.
దీంతో బిల్లులు భారీగా పెరగనున్నాయి. పదెకరాలు ఉన్న రైతు లక్షల్లో బిల్లు చెల్లించాల్సి వస్తుంది. ఇది చాలదన్నట్లు ఆక్వా ఉత్పత్తులపై మార్కెట్ రుసుమునూ రెట్టింపు చేసింది. వందకు రూపాయి చొప్పున వసూలు చేయాలని నిర్ణయించడంతో..ఈ భారమూ పరోక్షంగా రైతులే మోయాల్సి వస్తోంది. ఇప్పటికే ఆక్వాలో దాణా ధరలు పెద్దఎత్తున పెరిగాయి. పెట్టుబడి ఖర్చులు అధికమయ్యాయి. పవర్‌హాలిడేతో ధరలూ కొంతమేర తగ్గాయి. నష్టాల భయంతో కొట్టుమిట్టాడుతున్న రైతులపై ఇప్పుడు ప్రభుత్వం విద్యుత్తు భారం మోపింది. దీంతో చాలాచోట్ల సాగు ప్రశ్నార్థకమవుతోంది.
రాష్ట్రంలో 94వేల మంది ఆక్వా రైతులు ఉన్నారని అంచనా. అందులో రాయితీ అందుకున్న వారు 53వేల550 మంది. వారికి ఏడాదికి ఇచ్చిన రాయితీ 780 కోట్లు. ప్రస్తుతం ఛార్జీల పెంపుతో పదెకరాల రొయ్యల చెరువును సాగు చేస్తున్న రైతుల సగటు విద్యుత్తు వాడకం 40వేల యూనిట్లు అనుకుంటే.. గతంలో యూనిట్ రూపాయిన్నర చొప్పున ఉన్నప్పుడు విద్యుత్ ఖర్చు 60వేల రూపాయలు. యూనిట్ రూ.3.85 పైసలు చొప్పున లెక్కిస్తే లక్షా 54 వేల రూపాయలు. అంటే ఒక్కో రైతుపై అదనంగా పడే భారం రూ.94వేలు.
ఆక్వాలో రొయ్యల చెరువుల్లోనే విద్యుత్తు వాడకం ఎక్కువగా ఉంటుంది. రొయ్యలకు ఆక్సిజన్ అందించేందుకు ఏరియేటర్లను వాడతారు. ఇవి విద్యుత్తు ఆధారంగా నడుస్తాయి. రొయ్యల రైతుల్లో అయిదెకరాల లోపు వారు 40శాతం వరకు ఉంటారని అంచనా. మిగిలిన వారంతా అయిదెకరాల పైబడిన వారే. అయిదెకరాల లోపు సాగు వల్ల ఖర్చులు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. తాజాగా వారంతా యూనిట్‌కు 3.85 చొప్పున చెల్లించాల్సిందే. అంటే ఏకంగా 157 శాతం మేర బిల్లులు పెరగనున్నాయి.
విద్యుత్తు రాయితీ భారం తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఆక్వాజోన్‌లో ఉన్న వాటికే, అయిదెకరాల లోపు వారికే అనే నిబంధన తెచ్చిందని రైతులు విమర్శిస్తున్నారు. అధికశాతం చెరువులు ఆక్వాజోన్ బయటే ఉన్నాయని.. ఇలాంటివి సుమారు 40శాతం పైనే ఉంటాయని చెబుతున్నారు. దీంతో అయిదెకరాల లోపు ఉన్న రైతులకూ రాయితీ వర్తించే అవకాశాలు లేవని అంటున్నారు. నెల్లూరు జిల్లా కొమరిక, ఇందుకూరిపేటలోని చెరువులు ఆక్వా జోన్ పరిధిలో లేవు. అయినా వారు చిన్న రైతులే. ఇలాంటి వారికి రాయితీ అందే పరిస్థితి లేదు.
ఆక్వా రైతులు కాడిపడేస్తే లక్షలాది కుటుంబాలకు ఉపాధి దెబ్బతినడం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ రంగంపై ఆధారపడిన హేచరీలు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఐస్‌ప్లాంట్లు, రవాణా రంగం కుదేలవుతాయి. రాష్ట్ర ఆదాయంపైనా గణనీయమైన ప్రభావం పడుతుంది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 9.08శాతం ఈ రంగం నుంచే లభిస్తోంది. 2021-22 ఏడాదికి 67వేల కోట్ల మేర జీవీఏగా అంచనా వేశారు. ఏడాదికి 48 లక్షల టన్నుల చేపలు, రొయ్యల ఉత్పత్తి రాష్ట్రం నుంచి వస్తోంది. ఇందులో 11 లక్షల టన్నుల వరకు రొయ్యలు ఉంటాయి.
దేశీయ సముద్ర ఆహార ఎగుమతుల విలువలోనూ 36శాతం పైగా వాటా మనదే. ఏడాదికి సుమారు 17వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యం రొయ్యల ఎగుమతుల ద్వారా లభిస్తోంది. ఈ రంగంపై 17 లక్షలకు మందికి పైనే ఉపాధి పొందుతున్నట్లు అంచనా. లక్షా 92వేల 29 టన్నుల సామర్థ్యమున్న శీతల గోదాంలు, 4వేల183 టన్నుల సామర్థ్యంతో ప్రాసెసింగ్ ప్లాంట్లు, 5వేల729 టన్నుల సామర్థ్యంతో ఐస్‌ప్లాంట్లతోపాటు.. రూ.60 వేల మిలియన్ల సామర్థ్యంతో రొయ్యల హేచరీలు, రోజుకు 9వేల 594 టన్నుల సామర్థ్యంతో దాణా మిల్లులు ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి.
ప్రస్తుత ధరలు, పెరిగిన ఖర్చుల నేపథ్యంలో సాగు లాభదాయకం కాదని ఆక్వా రైతులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనరేటర్‌పై ఆధారపడుతున్నామని. దానివల్ల నిర్వహణ భారం అధికమవుతోందని అంటున్నారు. అలాగే హేచరీల్లో అమ్మకాలు తగ్గాయని.. దాణాకు భారీగా వ్యయమవుతోందని చెబుతున్నారు.
విద్యుత్తు రాయితీ పెంపుతో రైతులపై తీవ్ర భారం పడుతుందని భారత రొయ్యల రైతుల ఫెడరేషన్ అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు పేర్కొన్నారు. రెండేళ్లుగా వివిధ రకాల ఉత్పత్తుల ధరలు 30 నుంచి 40శాతం పెరిగాయని వివరించారు. రొయ్యల ధరల్లో ఒడుదొడుకుల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, విద్యుత్తు రాయితీ రూపంలోనే కొంతమేర లబ్ధి పొందుతున్నారని వివరించారు. అయిదెకరాలు పైబడిన రైతులకు యూనిట్‌కు రూ.2 నుంచి 2.50 పైసలు చొప్పున నిర్ణయించి అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
Guntur GGH: ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం.. కాలు పాడైపోయిందన్నా కనికరం చూపలేదు