Power cuts: పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని విద్యుత్ సంస్థలు నిర్ణయించాయి. సరఫరా మెరుగుపడనందున మరో వారం విరామాన్ని అమలుచేశాక అప్పటి పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 8 నుంచి విద్యుత్ విరామాన్ని అమలుచేస్తూ డిస్కంలు తీసుకున్న నిర్ణయం గురువారంతో ముగియడంతో మళ్లీ పొడిగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉంది. పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని ప్రకటించినా గ్రిడ్ డిమాండ్ అంచనాలకు మించి పెరుగుతోంది. దీంతో భద్రత దృష్ట్యా కోతలు విధించాల్సి వస్తోందని, దీనికితోడు కొన్ని రోజులుగా గృహవిద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని ఒక అధికారి వివరించారు.
కోతలతో తప్పని కష్టాలు: పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని అమలుచేయటం వల్ల డిమాండ్ 20 మి.యూనిట్ల వరకు తగ్గుతుందని, ఈ మేరకు గృహ వినియోగదారులకు సరఫరా మెరుగుపరచాలని డిస్కంలు భావించాయి. వాస్తవానికి డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ అందుబాటులో లేదు. బొగ్గు కొరత కారణంగా థర్మల్ కేంద్రాలను బ్యాక్‌డౌన్‌లో (ఉత్పత్తి తగ్గించడం) నిర్వహించటం వల్ల పూర్తిస్థాయి ఉత్పత్తి రావటం లేదు.
కృష్ణపట్నం థర్మల్ కేంద్రానికి బొగ్గు అందుబాటులో ఉన్నా యూనిట్ తరచూ చెడిపోతోంది. 800 మెగావాట్ల సామర్థ్యమున్న యూనిట్ బాయిలర్‌లో ఐదు రోజుల కిందట సాంకేతిక లోపం తలెత్తడంతో రెండు రోజులపాటు ఉత్పత్తి నిలిపేసి మరమ్మతు చేయాల్సి వచ్చింది. పని ప్రారంభించాక రెండు రోజుల్లోనే మరో చోట మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తింది. మళ్లీ బాగు చేయడానికి ఒకట్రెండు రోజులు పడుతుందని అధికారులు తెలిపారు. హిందుజా థర్మల్ కేంద్రంలో బొగ్గు నిల్వలు అందుబాటులో లేక పూర్తిస్థాయి ఉత్పత్తి రావటం లేదు.
ఇదీ చదవండి:
POLAVARAM : పోలవరం డయాఫ్రం వాల్ విధ్వంసం... ఎవరిదీ వైఫల్యం?