Telangana Weather News : ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలోని కొమరిన్ ప్రాంతం వరకూ విస్తరించింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
Hyderabad Rains : రాజధాని నగరంలో ఆదివారం రోజున పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకపూల్, అమీర్‌పేట, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్ ప్రాంతాల్లో వరుణుడి రాకతో వాహనదారులు తడిసి ముద్దయ్యారు. పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. మియాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మెహదీపట్నం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఉప్పల్, సికింద్రాబాద్, బేగంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గత కొన్ని రోజుగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉండగా.. ఇవాళ మరోసారి కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
నగరంలోని కవాడిగూడ, దోమలగూడ, భోలక్‌పూర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, జవహర్‌నగర్, గాంధీనగర్, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం ప్రాంతాల్లో వర్షం పడింది. రాజేంద్రనగర్, కిస్మత్‌పూరా, బండ్లగూడ జాగీర్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ, అత్తాపూర్‌లోనూ వరుణుడు దంచికొట్టాడు. పలుచోట్ల రోడ్లపైకి వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
జీహెచ్‌ఎంసీ సహాయక బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి రహదారులపై చేరిన వర్షం నీటిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. బేగంపేట నుంచి సికింద్రాబాద్ వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటం కూడా ట్రాఫిక్ సమస్యకు మరో కారణమైంది.
ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మామడ(నిర్మల్ జిల్లా)లో 5.7, మునిగడప(సిద్దిపేట)లో 5.4, లింగాపూర్(కుమురంభీం)లో 5.3, పెద్దమంతాల్(వికారాబాద్)లో 5.2 సెంటీమీటర్ల వర్షం పడింది.