తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో మంత్రుల పర్యటన (ministers visiting) సందర్భంగా జేబు దొంగలు చేతివాటం ప్రదర్శించారు. మంత్రుల వెంట ఉన్న నేతల మధ్యలో దూరి.. జేబుల్లో నుంచి లక్ష రూపాయల వరకు కాజేశారు. మోత్కూరులో శనివారం జరిగిన మార్కెట్ కమిటీ పాలక వర్గ ప్రమాణ స్వీకారానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి (Niranjan Reddy), విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి (Jagadeesh Reddy) హాజరయ్యారు.
వారు పట్టణానికి చేరుకోగానే స్వాగతం పలికేందుకు వాహనం చుట్టూ.. నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరారు. వీరితోపాటే దూరిన దొంగలు.. మోత్కూరు జడ్పీటీసీ(ZPTC) భర్త గోరుపల్లి సంతోష్‌రెడ్డి జేబులో నుంచి డబ్బులు కాజేశారు. ఈ కార్యక్రమం అనంతరం, తన జేబులో ఉన్న 40 వేల రూపాయలు పోయినట్లు గుర్తించిన సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కెమెరాల్లో ఆ దృశ్యాలు
జేబు దొంగతనం దృశ్యాలు మంత్రి పర్యటనను చిత్రీకరిస్తున్న ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి. తుంగతుర్తి నియోజకవర్గ పర్యటనలో భాగంగా.. మంత్రులు పర్యటించిన మోత్కూరు, శాలిగౌరారంలో జరిగిన కార్యక్రమాల్లో ఈ జేబు దొంగలు చేతివాటాన్ని ప్రదర్శించినట్లు స్థానిక నేతలు గుర్తించారు. రెండు కార్యక్రమాల్లో కలిపి మొత్తం లక్ష రూపాయల వరకు కాజేసినట్లు చెబుతున్నారు. గతంలోనూ తుంగతుర్తిలో ఎన్నికల వేళ.. ఓ జేబు దొంగ చేతివాటం ప్రదర్శిస్తూ చిక్కటంతో కార్యకర్తలు దేహశుద్ధి చేశారు.
యథేచ్చగా..
ఇద్దరు మంత్రుల పర్యటనలో భాగంగా పటిష్ఠ బందోబస్తు కోసం ఒక ఏసీపీ(ACP), ఇద్దరు సీఐలు (CI), నలుగురు ఎస్సైలు(SI),40 మంది పోలీస సిబ్బంది ఉన్నారు. అంతేకాకుండా ఈ సమావేశంలో సుమారు 2వేల మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంతమంది ఉన్నా.. జేబు దొంగలు యథేచ్చగా తమ చేతివాటం ప్రదర్శించటం గమనార్హం.
ఇదీ చదవండి:
Telugu Language Day: పలుకు పరవశం.. మాట మాధుర్యం.. ఇదీ తెలుగు గొప్పతనం!