Permission for Govt Medical College in Ramagundam: తెలంగాణ రామగుండంలో కొత్తగా నెలకొల్పనున్న ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సీట్లను ఇచ్చే ఉద్దేశం ఉందన్నట్లుగా లేఖ(లెటర్ ఆఫ్ ఇంటెంట్)ను జాతీయ వైద్య కమిషన్ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. వీటిలో తొలి, మలివిడత ఎన్‌ఎంసీ తనిఖీల ప్రక్రియ పూర్తయింది.
రాష్ట్రంలో కొత్తగా 232 మెడికల్ పీజీ సీట్లు.. తెలంగాణలో 9 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో కొత్తగా 232 పోస్టుగ్రాడ్యుయేషన్( పీజీ) మెడికల్ సీట్లను పెంచుతూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిలో సూర్యాపేట వైద్యకళాశాల 25, సిద్దిపేట 80, నల్గొండ 30, నిజామాబాద్ 16, ఉస్మానియా 32, మహబూబ్‌నగర్ 10, కాకతీయ 03, అదిలాబాద్ రిమ్స్ 22, గాంధీ వైద్యకళాశాలకు 12 పీజీ సీట్లను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు.
సెప్టెంబరు 7 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్.. పాలిటెక్నిక్ డిప్లొమా విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో రెండో ఏడాదిలో ప్రవేశించేందుకు సెప్టెంబరు 7 నుంచి ఈసెట్ కౌన్సెలింగ్ జరపాలని ప్రవేశాల కమిటీ గురువారం నిర్ణయించింది. రెండు విడతల కౌన్సెలింగ్ జరుపుతారు. సెప్టెంబరు 7-11వ తేదీ వరకు స్లాట్ బుకింగ్, 9-12 వరకు ధ్రువపత్రాల పరిశీలన, 9-14 వరకు ఐచ్ఛికాల నమోదు చేసుకోవచ్చు.
ఇవీ చదవండి: