గ్రామస్వరాజ్యం, స్థానిక స్వపరిపాలన గురించి మన నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప.. పంచాయతీలను పరిపుష్టం చేయరు. స్థానిక ప్రభుత్వాలకు పూర్తిస్థాయిలో నిధులు, విధులు బదలాయించరు. ఇక్కడంతా ఎమ్మెల్యేలదే పెత్తనం. పింఛన్లు, రోడ్లు.. అన్నీ వారి కనుసన్నల్లో జరగాల్సిందే. వారికిష్టం లేకపోతే అర్హత ఉన్నా పింఛను రాదు. అవసరం ఉన్నా రోడ్డు పడదు. నిధుల కోసం ప్రభుత్వం ముందు మోకరిల్లాల్సిందే. దాంతో పంచాయతీలు అవసరాలు తీర్చుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. కానీ కేరళలో అలా కాదు. అక్కడ పంచాయతీలే సుప్రీం. నిధులు, విధులు వారి చేతుల్లోనే ఉంటాయి. లబ్ధిదారుల ఎంపిక, అభివృద్ధి ప్రణాళిక రూపకల్పన, అమలు పూర్తిగా పంచాయతీలదే. ఆ రాష్ట్రం నిజమైన గ్రామస్వరాజ్యానికి నిదర్శనం. సర్పంచికి తెలియకుండా ఒక్క నిర్ణయమూ జరగదు. పంచాయతీలు తమ బడ్జెట్‌ని తామే తయారు చేసుకుంటాయి. రాష్ట్ర బడ్జెట్‌లో 35-40% నిధులు నేరుగా పంచాయతీలకు వస్తాయి. వీటికితోడు ఆర్థికసంఘం నుంచి వచ్చే నిధులతో పాటు, సొంత ఆదాయ వనరులూ ఎక్కువే. ఒక్కో పంచాయతీ వార్షిక బడ్జెట్ రూ.4 కోట్ల వరకు ఉంటుంది.
* ప్రతి పంచాయతీకి సొంత వాహనాలున్నాయి.
పటిష్ఠమైన మూడంచెల వ్యవస్థ
గ్రామ, బ్లాక్, జిల్లా పంచాయతీల రూపంలో కేరళలో పటిష్ఠమైన మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 941 గ్రామ పంచాయతీలు, 152 బ్లాక్ పంచాయతీలు, 14 జిల్లా పంచాయతీలు ఉన్నాయి. వీటి అధ్యక్షుల్ని ప్రత్యక్ష ఓటింగ్ విధానంలో ఎన్నుకుంటారు. జిల్లా ప్రణాళికా కమిటీలకూ రాష్ట్ర ఎన్నికల సంఘమే ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికైన అధ్యక్షుల్ని ‘ఎగ్జిక్యూటివ్ అథారిటీ’గా ప్రకటిస్తారు.
పంచాయతీలకు సర్వాధికారాలు
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలకు ఇవ్వాల్సిన 29 అధికారాలను కేరళ ప్రభుత్వం వాటికి బదలాయించింది. వాటిలో కొన్ని..
* వైద్య కళాశాలలు, ప్రాంతీయ ప్రత్యేక ఆస్పత్రులు మినహా వైద్యసంస్థలన్నీ స్థానిక ప్రభుత్వాల అధీనంలోనే ఉంటాయి.
* ఉన్నత పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్ని జిల్లా పంచాయతీలకు, ప్రాథమిక పాఠశాలలను పంచాయతీలకు బదలాయించారు.
* పేదరిక నిర్మూలన పథకాలన్నీ పంచాయతీల ద్వారానే అమలవుతాయి.
* సాంఘిక సంక్షేమ బాధ్యతలన్నీ స్థానిక ప్రభుత్వాలవే.
* రైతులకు సహకారం, వాటర్‌షెడ్‌లు, చిన్నతరహా నీటిపారుదల, పాడిపరిశ్రమ అభివృద్ధి, ఇన్‌ల్యాండ్ ఫిషరీస్ వంటి బాధ్యతలన్నీ పంచాయతీలవే.
* హైవేలు, ప్రధానమైన జిల్లా రహదారులు మినహా మిగతా రోడ్ల బాధ్యత వాటిదే.
* పారిశుద్ధ్యం, గ్రామీణ నీటి సరఫరా, లబ్ధిదారులకు పింఛన్లు అందజేయడం వంటివన్నీ పంచాయతీలే చేస్తాయి.
అన్ని విభాగాలూ పంచాయతీ పర్యవేక్షణలోనే..
పంచాయతీరాజ్ సిబ్బందే కాకుండా, గ్రామ పరిధిలో పనిచేసే విద్య, వైద్యం, పశువైద్యం, వ్యవసాయం, ఇంజినీరింగ్, సంక్షేమ విభాగాలపై పర్యవేక్షణ కూడా గ్రామ పంచాయతీలదే. సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలకు స్థానిక ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది. పంచాయతీ స్థాయిని బట్టి 15-22 మంది శాశ్వత సిబ్బంది ఉంటారు. వీరు కాకుండా.. ఇతర విభాగాలకు చెందిన మరో 116 మంది పంచాయతీ పర్యవేక్షణలో ఉంటారు. సిబ్బంది స్వేచ్ఛకు భంగం కలగకుండా, వారు ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేకుండా చూసేందుకు అవసరమైన రక్షణ వ్యవస్థ ఉంది.
* పంచాయతీల ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల్ని నిర్దిష్ట కాలావధిలోగా ఇచ్చేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో ఐటీ కియోస్క్‌లు ఏర్పాటుచేశారు.
జనాభా ఎక్కువ.. బడ్జెట్టూ ఎక్కువే
మన రాష్ట్రంలోలా కేరళలో పంచాయతీలు వేలల్లో ఉండవు. వాటి వైశాల్యం, జనాభా ఎక్కువ. ఒక్కో పంచాయతీలో సగటు జనాభా 20 వేలు. కోజికోడ్ జిల్లా కరాస్సెరీ పంచాయతీలో 2001 జనాభా లెక్కల ప్రకారమే 23,659 మంది ఉన్నారు. ప్రతి పంచాయతీకీ వెబ్‌సైట్ ఉంటుంది. బడ్జెట్, ఆడిట్ నివేదికలు, పథకాల లబ్ధిదారుల వివరాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. కరాస్సెరీ పంచాయతీ వార్షికాదాయం రూ.6 కోట్లపైనే.
గ్రామసభే సుప్రీం
కేరళ పంచాయతీల్లో గ్రామసభకు విశేషాధికారాలుంటాయి. లబ్ధిదారుల ఎంపిక, ప్రాధాన్యక్రమంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల్ని గుర్తించడం, సోషల్ ఆడిట్ వంటివి గ్రామసభల్లో నిర్వహిస్తారు. ప్రతి పంచాయతీలో మూడు స్థాయీ సంఘాలుంటాయి. వాటిపై పర్యవేక్షణకు పంచాయతీ అధ్యక్షుడి సారథ్యంలో స్టీరింగ్ కమిటీ ఉంటుంది. వివిధ రంగాల నిపుణులతో అంశాలవారీగా ఫంక్షనల్ కమిటీలూ ఉంటాయి.
నిధులతో పరిపుష్టం
నిధుల బదలాయింపునకు నిర్దిష్టమైన వ్యవస్థ ఉంది. ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్‌తో పాటు, పంచాయతీల పరిధిలోని ప్రభుత్వ విభాగాల నిర్వహణకు అవసరయ్యే నిధులూ ఆయా శాఖల బడ్జెట్‌ల నుంచి వస్తాయి.
* వృత్తి పన్ను, ఆదాయ పన్ను, భవనాలకు అనుమతుల ఫీజు, వినోదపన్ను, సేవాపన్ను, వినియోగ రుసుములతో పంచాయతీలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది.
* నిధులు సమకూర్చుకునేందుకు స్థానిక ప్రభుత్వాలు వినూత్న ఆలోచనలు చేస్తున్నాయి. పాలక్కాడ్ జిల్లా పంచాయతీకి మినీ జలవిద్యుత్ కేంద్రమే ఉంది.
ప్రతి పంచాయతీ ఒక సచివాలయమే
కేరళలో గ్రామ పంచాయతీ కార్యాలయమంటే పూర్తిస్థాయి సచివాలయమే. అన్ని పంచాయతీలకూ సొంత భవనాలున్నాయి. ప్రతి భవనంలో ఒక సమావేశ మందిరం, వేర్వేరు విభాగాలకు, సర్పంచి, కార్యదర్శులకు వేర్వేరుగా వసతులుంటాయి. ప్రతి పంచాయతీ కార్యాలయంలో సహాయతా కేంద్రం, ఫ్రంట్ ఆఫీసు ఉంటాయి.
* గ్రామాల్లో హైస్పీడ్ రూరల్ బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం కల్పించారు. ఈ ప్రాజెక్టును మొదటగా 2015లో ఇడుక్కి జిల్లాలో ప్రారంభించారు.
ప్రభుత్వ పాత్ర పరిమితం
గ్రామపంచాయతీల రోజువారీ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్రా ఉండదు. పంచాయతీ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించాలన్నా అంబుడ్‌్్సమన్, అప్పిలేట్ ట్రైబ్యునళ్లతో సంప్రదించాల్సిందే. బడ్జెట్‌ను ఆమోదించనప్పుడు, మెజార్టీ వార్డుసభ్యులు రాజీనామా చేసినప్పుడే పంచాయతీల పాలకమండళ్లను రద్దుచేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మిగతా సందర్భాల్లో అంబుడ్స్‌మన్‌ను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
* స్థానిక ప్రభుత్వాల ద్వారా ప్రజలకు ఈ-సర్వీసు అందించేందుకు ఇన్ఫర్మేషన్ కేరళ మిషన్ (ఐకేఎం) పలు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లు ప్రారంభించింది.
ప్రజా ప్రతినిధులకు శిక్షణ
ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, అధికారులకు కేరళ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ (కిలా) ద్వారా శిక్షణ ఇస్తారు. ఎన్నికలు పూర్తయిన నెలలోగా ప్రాథమిక శిక్షణ ఇస్తారు. తర్వాత రిఫ్రెషర్ కోర్సులు ఉంటాయి.
ఇదీ చదవండి
మూడేళ్లకొకసారే పెళ్లి బాజాలు.. తమ ఊరివారితోనే వివాహ సంబంధాలు