జాతీయ గ్రామీణా ఉపాధి హామీ పథకంలో రెండేళ్ల క్రితం చేపట్టిన పనులపై ప్రస్తుతం చేస్తోన్న విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణను నిలిపివేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగిస్తున్నారు. గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు అప్పగించిన పనుల రికార్డింగ్ అధికారాలను సైతం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాల్లో పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయాలు, విజయవాడలోని ఈఎన్సీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన ఇంజినీర్లు.. పూర్తిగా విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ ఆందోళన ప్రారంభించారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే మొత్తం పనులు స్తంభింపజేస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వ ఆదేశాలివే..!
2018 అక్టోబరు 1 నుంచి 2019 మే 31 వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధి హామీ పనులపై తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. రూ.10 లక్షల కంటే అంచనా ఎక్కువగా జరిగినవి 33,244 పనులుగా తేల్చి.. అందులో 11,967 పనులను ఇందుకు ఎంపిక చేసింది. అప్పట్లో చేపట్టిన అన్ని పనులు తనిఖీలు చేయడం సాధ్యం కానందున.. ఈ పరిమితిని పాటించాలని పేర్కొంది. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విజిలెన్స్ విభాగం, ఆర్‌డబ్ల్యూఎస్ సిబ్బంది, ఉపాధి పథకంలోని సోషల్ ఆడిట్ టెక్నికల్ సిబ్బంది, గ్రామీణాభివృద్ధి శాఖలోని క్వాలిటీ కంట్రోల్ విభాగం, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖల ద్వారా ఈ పనులను తనిఖీ చేసి.. ఆరునెలల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశించింది. ఏయే పనులను ఏ తనిఖీ బృందాలకు అప్పగించాలనేది జిల్లా స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. జిల్లా డ్వామా, పంచాయతీరాజ్ విజిలెన్స్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్, ఆర్‌అండ్‌బీ విజిలెన్స్ ఈఈలతో కమిటీ ఏర్పాటుచేసి పర్యవేక్షించాలని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఇంజినీర్ల అభ్యంతరాలివే..!
ఈ పనులను క్వాలిటీ కంట్రోల్, సోషల్ ఆడిట్ విభాగం ఇప్పటికే తనిఖీ చేసినప్పటికీ మళ్లీ అదే పని చేయాలనడాన్ని ఇంజినీర్లు తప్పుపడుతున్నారు. పనుల్లో అవకతవకలు జరిగితే టెక్నికల్‌గా అందుకు ఇంజినీర్లను బాధ్యులుగా చేస్తారని అంటున్నారు. ఎక్కువ అంచనా విలువ ఉన్న పనులను ఎంచుకుని.. ఎక్కడైనా ఫిర్యాదులొస్తే వాటిపై విచారణ చేపట్టడం ఎక్కడైనా ఆనవాయితీ గానీ.. ఇక్కడ అందుకు భిన్నంగా నడుస్తోందని ఆవేదన చెందుతున్నారు. ఇంజినీర్లపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని లిఖితపూర్వకంగా ప్రభుత్వం బదులిచ్చేవరకూ పనులు చేపట్టబోమని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి..
భూముల సర్వే వేగవంతం చేయండి: సీఎం జగన్