సర్పంచి పదవి ఆషామాషీ కాదు... ప్రజా సమస్యల పరిష్కారంలో వీరి పాత్ర ఎంతో కీలకం. ప్రస్తుతం ఏ ఊరు చూసినా పంచాయతీ ఎన్నికల సందడే. ఈ నేపథ్యంలో సర్పంచి అధికారాలు.. విధులు ఏంటో తెలుసుకుందాం.
సర్పంచి అధికారాలు..
- ప్రజాప్రయోజనాల దృష్ట్యా పంచాయతీ పరిధి ఏ పనినైనా వెంటనే చేపట్టే అధికారం ఉంటుంది. అవసరమైతే ఈవోతో చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్ఛు.
- దస్త్రాల పరిశీలన, గ్రామపరిధికి సంబంధించిన ఏ సమాచారాన్నైనా తెప్పించుకోవచ్ఛు.
- ఈవో తదితర సిబ్బంది కార్యకలాపాలపై సర్పంచిదే అజమాయిషీ. ఖాళీ అయిన ఉపసర్పంచి ఎన్నికల నిర్వహణకు చర్యలు చేపడతారు.
- మైనర్ పంచాయతీల్లో రూ.లక్ష, మేజర్ పంచాయతీల్లో రూ.2 లక్షల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతి మంజూరు సర్పంచి చేతుల్లోనే ఉంటుంది.
- పంచాయతీ వార్షికాదాయం రూ.10 లక్షలు మించితే కంప్యూటర్ కొనుగోలుకు అవకాశం ఉంది.
- అత్యవసరమైతే మైనర్ పంచాయతీల్లో రూ.5 వేలు, మేజర్ పంచాయతీల్లో రూ.10 వేలు వరకు ఖర్చు చేసే అధికారం ఉంటుంది.
విధులు..
- పంచాయతీ భవనాల నిర్మాణం, మరమ్మతులు, రోడ్డు, కల్వర్టుల నిర్వహణ.
- గ్రంథాలయాల ఏర్పాటు, వ్యవసాయ విధానాల మెరుగుపై ప్రచార కార్యక్రమాలు.
- సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, జాతరలు, ఉత్సవాల నిర్వహణ.
- నిరుద్యోగుల వివరాల సేకరణ, శాంతిభద్రతలపై నిఘా.
- మురుగు కాల్వల నిర్మాణం, మరమ్మతులు, వీధుల శుభ్రం, వీధి దీపాల ఏర్పాట్లు, నిర్వహణ.
- మరుగుదొడ్ల ఏర్పాటు, సామూహిక బావుల మరమ్మతులు, పూడికతీత, జనన, మరణాల నమోదు.
- రహదారుల వెంట మొక్కల పెంపకం, విద్య, ఆరోగ్య, విద్యాభివృద్ధి, వైద్యశాల, ఆటస్థలాల నిర్వహణ వంటి విధులు చేపడతారు.
ఇదీ చదవండి: బయోమెట్రిక్ ఆధారంగానే గ్రామ, వార్దు సచివాలయ సిబ్బంది జీతాలు