కరోనా నిర్ధారణ పరీక్షలు ప్రస్తుతం రాష్ట్ర సచివాలయంలోనే సాగుతున్నాయి. శాఖాధిపతులు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో నిర్వహించడం లేదు. ప్రభుత్వ కార్యాలయాలకు రోజూ వందల మంది సందర్శకులు వస్తుంటారు. లాక్‌డౌన్ అనంతరం కార్యాలయాలు పునఃప్రారంభమయ్యాక సందర్శకుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాకే లోపలికి అనుమతించేవారు. ప్రస్తుతం దీన్ని ఎక్కడా పాటించడం లేదు. వివిధ శాఖల కమిషనరేట్లు, ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాలు దాదాపుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. స్థల విస్తీర్ణం దృష్ట్యా ఇక్కడ ఉద్యోగుల మధ్య భౌతికదూరం సాధ్యం కావడం లేదు. రోజువారీ తరహాలో కార్యాలయాల్లో డిస్‌ఇన్‌ఫెక్షన్ ప్రక్రియ సాగడం లేదని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సచివాలయం, కమిషనరేట్లు, కలెక్టరేట్లలో ఇ-ఆఫీస్ ద్వారానే కార్యకలాపాలు సాగుతున్నాయని, ఇంటి నుంచే విధులు నిర్వహించినా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు.
వంతులవారీ విధానం...
కరోనా దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులకు వంతులవారీ పని విధానాన్ని అమలు చేయాలి. 50 శాతం మంది కార్యాలయాలకు హాజరైతే, మిగిలిన వారు ఇంటి నుంచే విధులు నిర్వహిస్తారు. ఉద్యోగులందరికీ కార్యాలయాలకు వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వాలి.- కేఆర్ సూర్యనారాయణ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు
ఇంటి నుంచి విధులకు అవకాశమివ్వాలి
కరోనా రెండోదశ దృష్ట్యా ప్రభుత్వ ఉద్యోగులు ఇంటినుంచే విధులు నిర్వర్తించేందుకు అనుమతివ్వాలి. దీనికి మరో ప్రత్యామ్నాయం లేదు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఉద్యోగులకు 14 రోజుల క్వారంటైన్‌ను సెలవుగా పరిగణించాలి.- బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్
50 ఏళ్లు దాటితే మినహాయించాలి
కరోనా ఉద్ధృతి నేపథ్యంలో... దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్నవారు, 50 ఏళ్లు దాటిన ఉద్యోగులకు ఇంటి నుంచే విధులకు అవకాశమివ్వాలి. రాష్ట్ర సచివాలయానికి సందర్శకులను పూర్తిగా నిషేధించాలి.- వెంకట్రామిరెడ్డి, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఛైర్మన్