Omicron Variant: ఒమిక్రాన్ బారినపడినా.. 3-4 రోజుల్లోనే ఎక్కువ మంది కోలుకుంటున్నారు. వారం రోజుల తర్వాత తిరిగి విధుల్లోకి చేరుతున్నవారూ ఉన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యధిక శాతం మందిలో గొంతుకే పరిమితమవుతుండటంతో.. ఆసుపత్రుల్లో చేరికలు కూడా అతి స్వల్పంగా ఉంటున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. జలుబు, జ్వరం, గొంతునొప్పి వంటి లక్షణాలు త్వరగానే తగ్గుముఖం పట్టినా..దగ్గు, తలనొప్పి, ఒళ్లునొప్పులు, నీరసం వంటివి మాత్రం వదలట్లేదు. వీటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, లక్షణాలకు అనుగుణంగా మందులు వాడడం ద్వారా నయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దగ్గు తీవ్రత పెరిగినా..స్వల్ప దగ్గు కూడా 6-7 రోజులకూ తగ్గకపోయినా.. వైద్యుడిని సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. అత్యధిక సందర్భాల్లో గొంతు వరకే పరిమితమైన ఒమిక్రాన్.. స్వల్ప సమయాల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే అవకాశాలున్నాయనీ..దీన్ని తొలిదశలో గుర్తించడం ద్వారా ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశముంటుందని వైద్యులు వివరిస్తున్నారు.
రెండోదశ కంటే భిన్నంగా..
కొవిడ్ రెండోదశలో డెల్టా వేరియంట్ విజృంభించినప్పుడు..అధికుల్లో శ్వాసకోశాలపై దుష్ప్రభావం పడింది. ఒమిక్రాన్ బాధితుల్లో పెద్దగా సమస్యలు ఎదురవడం లేదు.శ్వాసకోశాల్లో ఇన్‌ఫెక్షన్‌కు గురైనవారు కూడా ఒక శాతం కంటే తక్కువ మందే ఉంటున్నారు. ఆసుపత్రిలో చేరేవారు కూడా అతి స్వల్ప సంఖ్యలోనే ఉంటున్నారు.
ఒమిక్రాన్‌లో కనిపిస్తున్న లక్షణాలివి..
అత్యధికుల్లో తొలుత గొంతులో ఇబ్బంది, దురదతో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరిలో తలనొప్పితోనూ వ్యాధి మొదలవుతోంది. పారాసెటమాల్ ఇచ్చినా తగ్గడం లేదు. తలనొప్పి కొందరికి ఒకవైపే వచ్చి తీవ్రంగా వేధిస్తుంది. ఆ తర్వాత గొంతునొప్పి, జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా ఉంటోంది. కొందరు చలి జ్వరంతోనూ ఇబ్బంది పడుతున్నారు. డెంగీలో వచ్చినట్లుగా ఒళ్లునొప్పులు వస్తున్నాయి. ఉన్నట్టుండి చెమట పడుతోంది. పిల్లల్లో కొందరికి వాంతులు వస్తున్నాయి. కళ్లు కూడా ఎర్రబడుతున్నాయి. కొందరిలో వ్యాధి తగ్గినా కూడా.. 2-3 వారాలైనా దగ్గు తగ్గడం లేదు. దీనికి వేర్వేరు కారణాలుంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.సైనస్, గొంతు ఇన్‌ఫెక్షన్ వల్ల కూడా దగ్గు రావచ్చు. రాత్రివేళ పడుకున్నప్పుడు సైనస్‌ల నుంచి తెమడ ముక్కులోకి.. అక్కడి నుంచి గొంతులోకి జారుతుంది. దీన్ని బయటకు పంపించే ప్రక్రియలో భాగంగా దగ్గు వస్తుంది.అందుకే రాత్రి పూట ఎక్కువవుతుంది. పారాసెటమాల్ వేసుకున్నా తగ్గకపోతే.. ఇతర మందులు ప్రయత్నించాల్సి ఉంటుంది.
సీటీ స్కాన్‌లు చేయించడం లేదు
ఇప్పుడొస్తున్న ఇన్‌ఫెక్షన్లలో 95 శాతానికి పైగా ఒమిక్రానే. వైరస్ గొంతు వరకే పరిమితమవుతోంది. శ్వాసకోశాల్లోకి వెళ్లడం లేదు. గతంలో డీ డైమర్ విపరీతంగా పెరిగి, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు డీ డైమర్ కూడా పెరగడం లేదు. ఎక్స్‌రే, సీటీ స్కాన్‌లు కూడా చేయడంలేదు. నిమోనియా వైపు ఎక్కువ కేసులు వెళ్లడం లేదు. చాలా కొద్దిమందిలో..అదీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే ఆక్సిజన్ అవసరమవుతోంది. నిమ్స్‌లో అయితే ఒమిక్రాన్ బాధితుల్లో ఒక్కరు కూడా వెంటిలేటర్ పైకి వెళ్లలేదు. దీనివల్ల ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదు. చాలామంది పారాసెటమాల్‌తోనే కోలుకుంటున్నారు. దగ్గు మూణ్నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఉంటే దగ్గు మందు ద్రావణాన్ని సూచిస్తున్నాం.గొంతునొప్పి మూణ్నాలుగు రోజులైనా తగ్గకపోతే..అజిత్రోమైసిన్ వంటి యాంటిబయాటిక్స్ ఇస్తున్నాం. - డాక్టర్ పరంజ్యోతి, పల్మనాలజీ విభాగాధిపతి, నిమ్స్
లక్షణాలు తీవ్రమైతే ఆసుపత్రికి..
డెల్టాలో సాధారణంగా పొడి దగ్గు వచ్చేది. ఒమిక్రాన్‌లో తెమడతో కూడా దగ్గు వస్తోంది. లక్షణాలు తక్కువగా ఉండి ఎక్కువ రోజులున్నా కూడా సీఆర్‌పీ వంటి కొన్ని పరీక్షలు చేయిస్తున్నాం.ఎందుకంటే అంతర్లీనంగా ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించాల్సిన అవసరముంది. నిమోనియా దశకు వెళ్లినప్పుడు ఆయాసం, ఛాతీ పట్టేసినట్లుగా ఉండడం, మానసికంగా అయోమయ స్థితి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇంట్లో చికిత్స పొందుతున్న క్రమంలో.. మగతగా ఉండడం..రక్తంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తక్కువకు పడిపోతుండడం.. నాడి కొట్టుకోవడం 100 దాటుతున్నా..నిస్సత్తువ ఆవహించినా..డీడైమర్, సీఆర్‌పీ వంటి పరీక్షల్లో ఫలితాలు ఉండాల్సిన దాని కంటే 2-3 రెట్లు అధికంగా ఉన్నా..వెంటనే ఆసుపత్రిలో చేరాలని గుర్తుంచుకోవాలి. - డాక్టర్ విశ్వనాథ్ గెల్లా, ప్రముఖ శ్వాసకోశ నిపుణులు, ఏఐజీ.
ఇదీ చదవండి: