మద్యం దుకాణాల్లో పర్యవేక్షకులుగా(సూపర్‌వైజర్లు) ప్రజా రవాణాశాఖ (ఆర్టీసీ)కు చెందిన కండక్టర్లను నియమించే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలోని మద్యం దుకాణాల్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ నియమించిన పొరుగు సేవల సిబ్బంది పనిచేస్తున్నారు. పట్టణాల్లోని ఒక్కో దుకాణంలో ఒక సూపర్‌వైజర్, ముగ్గురు సేల్స్‌మెన్, గ్రామీణ ప్రాంతాల్లో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్ చొప్పున ఉన్నారు. కొన్నిచోట్ల మద్యం నిల్వల్లో తేడాలు వస్తుండటం, అమ్మకాల సొమ్ము సక్రమంగా బ్యాంకుల్లో జమచేయకపోవడం వంటి అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కండక్టర్లను సూపర్‌వైజర్లుగా నియమిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. మద్యం అమ్మకాలు ఎక్కువ జరిగే దుకాణాల్లో నియమించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఆర్టీసీలో అదనంగా ఉండే కండక్టర్లను డిప్యుటేషన్‌పై పంపితే, వారికి బేవరేజేస్ కార్పొరేషన్ జీతం చెల్లించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం అనుమతిస్తేనే..
త్వరలో లారీల్లో సరకు రవాణాకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా బేవరేజెస్ కార్పొరేషన్‌కు చెందిన మద్యం నిల్వలు దుకాణాలకు రవాణా చేసేలా రెండు సంస్థల ఉన్నతాధికారులు ఇటీవల చర్చలు జరిపారు. ఆ సమయంలోనే కండక్టర్లను సూపర్‌వైజర్లుగా నియమించే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలిసింది. ఇది పరిశీలన దశలోనే ఉందని, దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి: కృష్ణా బోర్డు ఛైర్మన్‌గా పరమేశం