ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగుతున్నాయి. ఎగువ నుంచి వస్తోన్న భారీ వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. శనివారం ఉదయం గోదవారి నీటిమట్టం 43 అడుగులకు చేరడం వల్ల అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గంటగంటకు నీటిమట్టం పెరుగుతున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొత్తకాలనీ, సుభాష్‌నగర్ కాలనీవాసులను పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. భద్రాచలంలో నిన్న 20 అడుగులుగా ఉన్న గోదావరి నీటి మట్టం.. ఈ ఉదయానికి 43 అడుగులు దాటింది. పెరిగిన ప్రవాహంతో... స్నానఘట్టాల ప్రాంతంతో పాటు మెట్లు, విద్యుత్ స్తంభాలు వరద నీటిలో మునిగాయి. మొదటి ప్రమాద హెచ్చరిక జారీతో లోతట్టు ప్రాంతాలైన అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, సుభాష్‌నగర్ కాలనీల వాసులను అధికారులు పునరావాసాలకు తరలించారు.
ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ఇంకా పెరుగుతున్నందున.... నీటి మట్టం ఎక్కువయ్యే అవకాశముందని సీడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే వరద కారణంగా పర్ణశాల వద్ద సీతావాగులోని సీతమ్మ విగ్రహం, నార చీరల ప్రాంతం వరద నీటిలో మునిగిపోయింది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు వద్ద 15 గేట్లను విడుదల చేసి 18,176 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
గోదావరి ప్రవాహం దృష్ట్యా... ములుగు జిల్లాలో ముంపు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఏటూరునాగారం ముల్లెకట్టే వారధి వద్ద గోదావరి వరద ఉద్ధృతిని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య పరిశీలించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా... అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. తుపాకుల గూడెంలోని సమ్మక్క సాగరం బ్యారేజీ వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. 59 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద ప్రవాహం పెరుగుతున్నందున... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు పాలనాధికారి కార్యాలయంలో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:
Huge Floods to Godavari: గోదావరికి వరద ఉద్ధృతి.. సముద్రంలోకి 3.26 లక్షల క్యూసెక్కులు!