తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు మొత్తం 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభమయ్యాయి. చాలా రోజుల తర్వాత... పాత విధానంలోనే చేపట్టిన రిజిస్ట్రేషన్లతో కార్యాలయానికి పెద్దఎత్తున జనం తరలివచ్చారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పాతపద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... రిజిస్ట్రేషన్లు సులువుగా, వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. ఎలాంటి ముందస్తు స్లాట్ల బుకింగ్ విధానం లేకుండా కార్డ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టింది. అయితే అనుమతి లేని, అనధికారిక, క్రమబద్ధీకరణకాని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు చేయటం లేదు.
సాధారణ రద్దీ
కూకట్‌పల్లి పరిధి మూసాపేట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి ఉదయం నుంచే రిజిస్ట్రేషన్లు చేయించుకునేందురు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్నవారికి కేటాయించిన నిర్దేశిత సమయంలోనే రిజిస్ట్రేషన్లను పూర్తిచేశారు. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ ఉండగా... మరికొన్ని చోట్ల రద్దీ సాధారణంగానే కనిపించింది.
ఆదాయం కోల్పోయిన ప్రభుత్వం
కొవిడ్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలుతో... మార్చి మూడోవారంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తిరిగి మే 11న మొదలైనా... ఆశించిన స్థాయిలో ఆస్తుల క్రయవిక్రయాలు జరగలేదు. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు పుంజుకునే సమయానికి రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు చేసేందుకు సెప్టెంబరు 8 నుంచి రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. ఫలితంగా రోజుకు రూ.30 కోట్ల నుంచి రూ.40కోట్ల మేర ప్రభుత్వం ఆదాయం కోల్పోయింది.
సరళతరంగా ప్రక్రియ
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం భావించినా... సర్కారు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ... హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుల పరిష్కారం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో... ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ప్రారంభించింది. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేసి సమూల మార్పులు చేసింది.
ఇదీ చదవండి : ఆస్తుల నమోదు సమయంలో ఆధార్ అడగొచ్చు: ప్రభుత్వం