కీలకమైన కొత్త రైల్వే ప్రాజెక్టులు అవి. వివిధ ప్రాంతాలను కలుపుతూ ప్రయాణికులు, సరకు రవాణాకు వీలు కల్పించేవి. రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వేగంగా పూర్తవుతాయనుకుంటే.. ఏళ్లతరబడి సా...గుతూనే ఉన్నాయి. ఇదేమిటంటే రాష్ట్ర వాటా కింద నిధులు ఇవ్వడం లేదని, వాటిని జమ చేస్తేనే పనులు జరుగుతాయని రైల్వేశాఖ చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిధులివ్వడంతో.. రైల్వే శాఖ కూడా ఏటా బడ్జెట్‌లో తన వాటా కింద పరిమితంగానే నిధులు కేటాయించి అంతంతమాత్రంగా పనులు చేస్తోంది. ఈ కోవలోకి వచ్చేవే... నడికుడి-శ్రీకాళహస్తి, కడప-బెంగళూరు, కోటిపల్లి-నర్సాపురం కొత్త రైల్వే మార్గాలు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.1,871 కోట్లు జమ చేయాల్సి ఉంది. ఆ నిధులు ఇవ్వకపోవడంతో ఆయా ప్రాజెక్టుల పనులు జాప్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
కడప - బెంగళూరు మధ్య 255 కి.మీ. కొత్త లైను 2008-09లో మంజూరైంది. ఇందులో 218 కి.మీ.లోని మదఘట్ట వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి. మిగిలిన 43 కి.మీ. దక్షిణ పశ్చిమ రైల్వే పరిధిలోకి వస్తుంది. మన రాష్ట్రంలో 205 కి.మీ. నిర్మించాల్సి ఉంది. నిర్మాణ వ్యయంలో 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది. మొత్తం అంచనా వ్యయం 3,038 కోట్లు. ఇందులో దక్షిణ మధ్య రైల్వే వాటా రూ.2,258 కోట్లు ఉంది. 2017లోనే కడప -పెండ్లిమర్రి మధ్య 21.30 కి.మీ. మార్గాన్ని పూర్తి చేశారు. అప్పటి నుంచి పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం గతంలో రూ.190 కోట్లు జమ చేసింది. అయితే పెండ్లిమర్రి నుంచి పనులు ముందుకు సాగేందుకు మరో రూ.200 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఏపీ, కర్ణాటకలో భూసేకరణ పూర్తయి వరుసగా నిధుల కేటాయింపులు జరిగితే 2025-26 నాటికి ఇది ఒక కొలిక్కివస్తుంది.
కోటిపల్లి-నర్సాపురం మధ్య 57.21 కి.మీ. కొత్త లైను 2000-01లో మంజూరైంది. ఇది కోనసీమ ప్రాంతాల మీదుగా వెళ్తుంది. మొత్తం వ్యయంలో 25 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాల్సి ఉంది. ప్రస్తుతం దీని అంచనా విలువ రూ.2,192 కోట్లకు చేరింది. రైల్వేశాఖ 751 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2.69 కోట్లే ఇచ్చింది. ఇంకా రూ.309 కోట్లు ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులిచ్చి, భూసేకరణకు సహకారం అందిస్తే మూడేళ్లలో దీనిని పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: గవర్నర్కు లేఖల లీకేజీ కేసు వచ్చే మంగళవారానికి వాయిదా