Agriculture sector: రాష్ట్ర వ్యవసాయశాఖలో కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఏటికేడు తగ్గిపోతోంది. ప్రధానంగా కొన్నింటినే ఎంచుకుని, వాటి అమలుకే పెద్ద పీట వేస్తోంది. ఈ మేరకు 2022-23 బడ్జెట్లో రాష్ట్రీయ కృషి వికాస యోజన, కృషి ఉన్నతి యోజనలకే ప్రభుత్వం రూ.2వేల కోట్లను కేటాయించింది. ఇది గతంతో పోలిస్తే భారీ పెంపు. మిగిలిన అధిక శాతం పథకాలకు సున్నా చుట్టేశారు.
సాధారణంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం 60%, రాష్ట్రం 40% చొప్పున నిధులు ఇస్తాయి. రెండేళ్లుగా రాష్ట్రం వివిధ కేంద్ర పథకాలకు తన వాటా చెల్లించడం లేదు. కేంద్రం విడుదల చేస్తున్న నిధులనూ ఖర్చు చేయడం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ, జాతీయ ఆహార భద్రతా పథకం కింద వివిధ కార్యక్రమాల అమలు నిలిచిపోయింది. పశు సంవర్థక, మత్స్య, ఉద్యానశాఖల పరిధిలోనూ ఇలాగే ఉంది. దీంతో సింగిల్ నోడల్ ఏజెన్సీ ఖాతా తెరిచి.. వివరాలను పంపిస్తే అందులోనే నిధులు జమ చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్రం తమ వాటా విడుదల చేస్తేనే ఇందులో నుంచి నిధులను తీసుకునే వీలుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యవసాయశాఖ పరిధిలో 9 పథకాల కింద 20 కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వీటిలో ఈ ఏడాది ఆర్‌కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) కింద రూ.1,400 కోట్లు, కృషి ఉన్నతి యోజనకు రూ.600 కోట్లు కేటాయించారు.
- జాతీయ ఆహార భద్రతా పథకం కింద వాణిజ్య పంటలు (పత్తి), నూనెగింజలు, వ్యవసాయ విస్తరణ సాంకేతికత, వ్యవసాయ విస్తరణపై ఉపమిషన్, సీడ్ ప్లాంటింగ్, పాలక ప్రణాళిక, యాంత్రీకరణ ఉపమిషన్, సుస్థిర వ్యవసాయ జాతీయ మిషన్, వర్షాభావ ప్రాంతాల అభివృద్ధి, భూ ఆరోగ్య నిర్వహణ, భూ ఆరోగ్య కార్డు, ఆశావహ జిల్లాల అభివృద్ధి నిధులు తదితర పథకాలకు ఈ ఏడాది కేటాయింపులే లేవు. చిరు ధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు కార్యక్రమాల అమలు రెండేళ్లుగా నిలిచింది.
- వ్యవసాయ యాంత్రీకరణ ఉప మిషన్ కింద 2021-22 సంవత్సరంలో రూ.739.46 కోట్లు కేటాయించి... సవరించిన అంచనాల్లో రూ.673.80 కోట్లను చూపించారు. కొత్త పద్దులో ఎంత అనేది చెప్పలేదు.
- ఉద్యానశాఖలోనూ జాతీయ ఆహార భద్రతా మిషన్ (ఆయిల్‌పామ్) కింద 2021-22లో రూ.44.60 కోట్లు కేటాయించగా సవరించిన అంచనాల్లో అది.. రూ.28.74 కోట్లుగా ఉంది. కేటాయించిన మొత్తం ఖర్చు కాలేదు. ఈ ఏడాది కేటాయింపు లేదు.
- ప్రధానమంత్రి కృషి సించాయి యోజన కింద 2021-22 బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించి. రూ.81 కోట్లు ఖర్చు చూపారు. 2022-23 బడ్జెట్లో రూ.350 కోట్లు కేటాయించారు.
- పశుసంవర్థక శాఖలో జాతీయ పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ, వృత్తి నైపుణ్యం, పశుగ్రాస అభివృద్ధి తదితర పథకాల కింద చేపట్టే కార్యక్రమాలకు నిధులు కేటాయించలేదు. వీటి కింద మొత్తం 55 ఉండగా 14 కార్యక్రమాలకే రూ.121.47 కోట్లు కేటాయించారు. మత్స్యశాఖలో నీలి విప్లవం (బ్లూ రివల్యూషన్) కింద అమలయ్యే 11 కార్యక్రమాలకు 2022-23 బడ్జెట్లో సున్నా చుట్టారు.
- రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ల్యాబ్‌లు, ఇతర కార్యక్రమాలకే ప్రాధాన్యమిస్తోంది. రైతులకు వ్యక్తిగత ప్రయోజనం కల్పించే యాంత్రీకరణ, సూక్ష్మ సేద్యం ఇతర రాయితీ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వ్యవసాయ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:
మూడేళ్లుగా పాత బస్సులతోనే నెట్టుకొస్తోన్న ఆర్టీసీ... కొత్తవి రోడ్డెక్కేదెప్పుడు..?