ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరోగ్యశ్రీ ఆసరా పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు అధికారులు నూతన సాఫ్ట్వేర్లను వినియోగిస్తున్నారు. బాధితులకు ఆసరా కింద నగదు చెల్లింపులో అవకతవకలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో డా. మల్లికార్జున తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం 2438 ప్రొసీజర్స్కు చికిత్స అందిస్తున్నామని వివరించారు. గతంలో నెలకు 47 వేల క్లెయిమ్స్ వచ్చాయని... ప్రస్తుతం 85 వేలు వస్తున్నట్లు సీఈవో తెలిపారు. క్లెయిమ్స్ పంపిన మూడు వారాల్లో ఆసుపత్రులకు బకాయిలను చెల్లిస్తున్నామని చెప్పారు.
ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయించుకుని ఇంటికి వెళుతున్న వారికి... ఆసరా కింద ఇప్పటివరకు రూ.253 కోట్లను.. 4 లక్షల 13 వేల మంది లబ్ధిదారుల ఖాతాలో జమ చేసినట్లు ఆరోగ్యశ్రీ సీఈవో డా. మల్లికార్జున తెలిపారు. కొందరు ఆరోగ్యమిత్ర సిబ్బంది ఇటీవల బ్యాంకు ఖాతాలేని లబ్ధిదారుల నగదును తమ ఖాతాల్లోకి మార్చినట్లు వెలుగుచూసింది. అప్రమత్తమైన అధికారులు నూతన సాఫ్ట్వేర్లను వినియోగించి ఆసరా పథకం లావాదేవీలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. ఎక్కువసార్లు నగదు వెళుతున్న బ్యాంకు ఖాతాలపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు.
ఇదీ చదవండీ... సోమవారం నామినేషన్ దాఖలు చేస్తా: రత్నప్రభ