Nallari Kishorekumar reddy: రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డిలకు శ్రీలంక పాలకులకు పట్టిన గతే పడుతుందని తెదేపా నేత నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. తమిళనాడుకు చెందిన వివాదాస్పద వ్యాపారవేత్త శేఖర్‌రెడ్డితో కుమ్మక్కై ఇసుక దందా చేస్తున్నారని ఆరోపించారు. భూములు, ఇసుక, మద్యం, గనుల్లో వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్న పెద్దిరెడ్డి.. పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు.
‘‘పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని గనుల యజమానుల దగ్గర కమీషన్లు దండుకుంటున్నారు. ఇవ్వకపోతే, గనుల్లో వాటా రాయించుకుంటున్నారు. అదీ కుదరకపోతే రూ.వేల కోట్ల జరిమానాలు వేస్తున్నారు. గత ఎన్నికల్లో వైకాపాకు ఆర్థిక సాయం చేసిన తెలంగాణకు చెందిన వారికి ఏపీలో గనులున్నాయి. వాళ్ల దగ్గరా కమీషన్లు దండుకున్నారు. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావుకు చెందిన మైనింగ్ కంపెనీకి రూ.1000 కోట్లకుపైగా జరిమానా వేస్తామని బెదిరించి వైకాపాలో చేర్చుకున్నారు. చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకుడికి చెందిన మనోహర్ మైన్స్‌కి జరిమానాలు విధించి వైకాపాలో చేర్చుకున్నారు’’ అని కిషోర్ కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు.
‘‘పెద్దిరెడ్డి కనుసన్నల్లో చిత్తూరు జిల్లా నుంచి రోజూ బెంగళూరు, చెన్నైలకు 300 ట్రిప్పర్ల ఇసుక వెళుతోంది. మీడియా సమక్షంలో పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి అక్రమాల్ని నిరూపించేందుకు మేం సిద్ధం. రాష్ట్రంలో ఉచిత ఇసుక రద్దుచేసి, శేఖర్‌రెడ్డి దగ్గర డబ్బు తీసుకుని, తెలంగాణ, తమిళనాడు పోలీసులతో కుమ్మక్కై పొరుగు రాష్ట్రాల్లో ఇసుక దందా సాగిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం.. పేదలకు ఇళ్లు కట్టించేందుకు ఇసుక వాడుతుంటే చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారంటున్నారు. పేదలకు తమిళనాడు, బెంగళూరుల్లో ఇళ్లు కడుతున్నారా?’’ అని మండిపడ్డారు.