తెలంగాణలో.. నోముల నర్సింహయ్య హఠాన్మరణంతో ఖాళీ అయిన నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నిడమనూరులోని తహసీల్దార్ కార్యాలయాన్ని రిటర్నింగ్ అధికారి కేంద్రంగా మార్పు చేశారు. ఈ ఉప ఎన్నికకు మంగళవారం నోటిఫికేషన్ వెలువడనుండగా.. నామినేషన్ల ప్రక్రియ షురూ కానుంది. మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తుండగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు ఈసీ సమయాన్ని నిర్దేశించింది.
ఉత్సాహంతో తెరాస శ్రేణులు
మూణ్నాలుగు నెలలుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నెలకొన్న ఎన్నికల కోలాహలం మరో నెలన్నర పాటు కొనసాగనుంది. ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుని ఉత్సాహంలో ఉన్న తెరాస సాగర్‌నూ మళ్లీ నిలబెట్టుకోవాలని కసరత్తు చేస్తోంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత డీలా పడ్డట్లు కనిపించిన గులాబీ శ్రేణులు... ఎమ్మెల్సీ విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాయి. సాగర్‌లో సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. దీటైన పోటీ ఇవ్వాలని భాజపా భావిస్తోంది. ఎవరికి అభ్యర్థిత్వాన్ని కట్టబెడతారన్నది అధికార పార్టీలో ఆసక్తికరంగా తయారైంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు ఇప్పటికే ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు బాధ్యతలు కట్టబెట్టింది.
అభ్యర్థిత్వ ఖరారుపై ఉత్కంఠ
ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నర్సింహయ్య తనయుడు నోముల భగత్, ఎంసీ కోటిరెడ్డి, గురువయ్య యాదవ్ తదితరులు తెరాస నుంచి టికెట్ ఆశిస్తున్నారు. బీసీలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్న తరుణంలో ఆ వర్గానికి టికెట్ దక్కుతుందా, లేదా అన్నది చూడాలి. కొంతకాలం నుంచి నియోజకవర్గం చుట్టేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. భాజపా సైతం ప్రచారాన్ని వేగవంతం చేసింది. అభ్యర్థిత్వ ఖరారులో ఆ పార్టీలోనూ అంతర్గత పోరు నెలకొన్న వేళ టికెట్ ఆశావహుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకే కేటాయించాలంటూ తిరుమలగిరి , పెదవూర మండలాల్లో కమలదళం పాదయాత్ర చేస్తోంది. ప్రధాన పార్టీలన్నీ సాగర్ ఉపఎన్నిక ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి.
ఇదీ చదవండి: పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: సీఎం