‘రాష్ట్రంలో పేరున్న జువారి సిమెంట్స్, అమరరాజా సంస్థల్లో ఉత్పత్తిని రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేయించింది. ఇలాంటి అమానవీయ చర్యలతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పారిశ్రామిక ఉపాధి రంగం బలిపీఠంపై నిలిచింది..’అని నరసాపురం ఎంపీ రఘు రామకృష్ణరాజు పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం సంకుచిత మనస్తత్వంతో వ్యాపార సంస్థలను వేటాడుతుండటం గర్హణీయం. ఇలాంటి మితిమీరుతున్న రాజకీయ చర్యలను నియంత్రించండి..’ అని విజ్ఞప్తి చేస్తూ ప్రధాని నరేంద్రమోదీకి శనివారం ఆయన లేఖ రాశారు.
‘జువారి మంచి గుర్తింపు కలిగిన సంస్థ. ప్రత్యక్షంగా, పరోక్షంగా 8వేల మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు పనిచేస్తున్నారు. అలాంటి ఈ సంస్థకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే ఉత్పత్తిని నిలిపివేయించింది. ఇక రెండోది అమరరాజా బ్యాటరీస్. సుమారు 15 వేల మందికి ఉపాధి కల్పించిన ఆ సంస్థ యాజమాన్యం రాష్ట్రంలో రాజకీయ అధికార ప్రతీకారాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం చాలా సాధారణ కారణాన్ని చూపించి ఈ సంస్థనూ మూసివేయించింది. ఈ చర్యలు కార్మికులు, వారి కుటుంబాలను తీవ్ర బాధకు గురిచేస్తున్నాయి. ఈ వ్యతిరేక విధానాలు రాష్ట్రంలో పారిశ్రామిక సంక్షోభానికి దారితీస్తుందన్న ఆందోళనను పెంచుతోంది. దశాబ్దాలుగా రాష్ట్రం సాధించుకున్న విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి వస్తోంది..’ అని ఆ లేఖలో వివరించారు.
ఇదీ చదవండి: