దిల్లీలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన ... రాష్ట్రపతిని కలిసి అన్ని విషయాలు వివరించానని చెప్పారు. తన వ్యక్తిగత భద్రతతో పాటు అమరావతి అంశంపై వినతి పత్రాలను అందించానని తెలిపారు. వ్యక్తిగతంగా ఏ ఘటనల్లో తనపై ప్రభుత్వానికి కోపం వచ్చిందనే విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లానని వివరించారు.
'వ్యక్తిగత భద్రతతో పాటు అమరావతి సమస్యను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాను. నా విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించి.. చర్యలు తీసుకునేందుకు హామీనిచ్చారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో అమరావతికి అనుకూలంగా జగన్ అభిప్రాయాన్ని వెల్లడించారు. రాజధాని ప్రాంతంలోనే జగన్... నివాసం కట్టుకున్నారని నాడు వైకాపా నేతలు కూడా చెప్పారు. భారత రాజ్యాంగంలో విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. తప్పు జరిగితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రశ్నిద్దాం. ఆర్థిక ఇబ్బందుల్లో విశాఖలో రాజధాని ఎలా కడతారని అడిగే హక్కు ఉంది. కేసుల గురించి భయపడాల్సిన అవసరం వద్దు. అమరావతి గురించి కష్టపడదాం. విశాఖపట్నం తరలించినా కార్యనిర్వహక రాజధాని అమరావతిలోనే ఉండేలా కోరుదాం. కేవలం ఒక్క కులం పేరుతో తరలించటం ఏ మాత్రం సరికాదు. రాష్ట్రపతి దగ్గర పూర్తి సమాచారం ఉంది. రాజధాని విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. పార్టీపై బురద చల్లే వాడిని కాదు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జరుపుతోంది. రెండు మూడు నెలల్లోనే నిజమైన దోషులెవరనేది బయటపడుతుంది.'
- రఘురామకృష్ణరాజు, వైకాపా ఎంపీ
జోక్యం చేసుకోవాలని కోరా
ఏపీలో పరిస్థితులపై జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్లు ఎంపీ రఘురామకృష్ణమరాజు తెలిపారు. అమరావతిని పూర్తి రాజధానిగా కాకపోయినా పరిపాలనా రాజధానిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించారు. రాష్ట్ర బిల్లుల ఆమోదంలో కేంద్ర ఏజీ వద్ద గవర్నర్ న్యాయ సలహా తీసుకోవాలని.. రాష్ట్ర న్యాయవాదుల సలహాలతో సమస్య పరిష్కారం కాదని ఎంపీ అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వమే ఉసిగొల్పుతోంది
తెలుగు భాషపై మాట్లాడితే తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. తనపై ప్రభుత్వానికి కోపం వచ్చిందని.. తనపై దాడికి ఉసిగొల్పుతోందని ఎంపీ ఆరోపించారు. వైకాపా నేతలు పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న తేడాను గమనించట్లేదన్న ఆయన.. ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి తనకు ముప్పు ఉందని రాష్ట్రపతికి తెలిపినట్లు చెప్పారు.
ఇదీ చదవండి:
రాష్ట ప్రభుత్వ భద్రత వద్దు.. కేంద్ర బలగాలతో కావాలి: రఘురామకృష్ణరాజు