మండలిలో బలాన్ని ఆసరాగా చేసుకుని, ఏవో సాంకేతిక కారణాలు చూపుతూ అభివృద్ధిని తెదేపా అడ్డుకుంటూ వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వచ్చే మే నెల నాటికి మండలిలో వైకాపాకు మెజారిటీ లభిస్తుందని, జగన్ చేసే అభివృద్ధి పనులకు ఉభయ సభల్లోనూ మద్దతు లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా సి.రామచంద్రయ్య, మహ్మద్ ఇక్బాల్, కరీమున్నీసా, దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరథరెడ్డి, కళ్యాణ చక్రవర్తి నామినేషన్లు వేసిన అనంతరం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందనే నమ్మకాన్ని సీఎం జగన్ కల్పించారని, ఇతర పార్టీల్లోలాగా అభ్యర్థుల ఎంపికలో ఊహాగానాలకు తావివ్వలేదని తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు పెద్దల సభను ఐదేళ్ల నుంచి రాజకీయ వేదికగా వాడుకున్నారని ఎమ్మెల్సీ అభ్యర్థి సి.రామచంద్రయ్య విమర్శించారు. ‘శాసన మండలి ప్రతిష్ఠ తగ్గిపోయింది. దాన్ని పెంచేందుకు కృషి చేస్తాం’ అని పేర్కొన్నారు. ‘ఎమ్మెల్యే బాలకృష్ణవద్ద సినిమాల ప్రణాళిక తప్ప ప్రజలకు మేలు చేయాలనే ప్రణాళిక లేదు. హిందూపురాన్ని బాలకృష్ణ తన పీఏలకు వదిలేశారు’ అని మరో ఎమ్మెల్సీ అభ్యర్థి ఇక్బాల్ వ్యాఖ్యానించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టెక్కలిలో వైకాపా జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్సీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. కరీమున్నీసా, భగీరథరెడ్డి, కల్యాణ చక్రవర్తి వేర్వేరుగా మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తమను ఎంపిక చేసినందుకు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మండలి నామినేషన్ పత్రాల అందజేత
శాసనమండలిలో సభ్యత్వం కోసం పోటీ చేస్తున్న ఆరుగురు వైకాపా అభ్యర్థులు గురువారం ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. పోటీ చేసే అవకాశం కల్పించినందుకు వారంతా ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి అభినందనలు తెలుపుతూ అందరికీ వైకాపా బి.ఫారాలను అందజేశారు.
ఇవీ చదవండి