తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ అంశాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సబ్‌కమిటీ సమావేశంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సీఎస్ సోమేశ్ కుమార్, అధికారులు పాల్గొన్నారు. బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారుల అభిప్రాయాలు మంత్రులు సేకరించారు.
అదనపు సిబ్బంది సర్దుబాటు
రిజిస్ట్రేషన్ల సమయంలో ఎదురవుతున్న సమస్యలను బిల్డర్లు, రియల్ ఎస్టేట్ సంఘాలు వివరించాయి. వారు చెప్పిన విషయాలను మంత్రివర్గ ఉపసంఘం సావధానంగా ఆలకించింది. సమావేశంలో మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రద్దీ ఆధారంగా రిజిస్ట్రేషన్ల కార్యాలయాలను 4 విభాగాలుగా వర్గీకరించామని... ఎక్కువ పని ఒత్తిడి ఉండేచోట అదనపు సిబ్బందిని సర్దుబాటు చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
పెండింగ్ రిజిస్ట్రేషన్లు లేకుండా చర్యలు
ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు బిల్డర్లు, స్థిరాస్తి వ్యాపారులు సహా వివిధ వర్గాలతో సమావేశమవుతామని మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. రిజిస్ట్రేషన్ల అంశానికి సంబంధించి వారి అభిప్రాయాలు, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకోవటంతో పాటు సలహాలు, సూచనలు స్వీకరిస్తామని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. మార్చి వరకు ఎలాంటి పెండింగ్ రిజిస్ట్రేషన్లు లేకుండా చర్యలు తీసుకునేలా యంత్రాంగానికి ఉపసంఘం నిర్దేశించింది. వారంలోపే రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తామని మంత్రివర్గ ఉపసంఘం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: కుటుంబీకుల జాడ కోసం పాకిస్థాన్ నుంచి బాసరకు..