Minister Buggana and Peddireddy at YSRCP Plenary: ‘గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులతో.. కొవిడ్‌లో ఇబ్బందికర పరిస్థితుల్లో కరెంటు బిల్లులు కట్టిన విషయం వాస్తవమే. సీఎం ఆదేశాలతో ఇప్పుడు వారి నిధులు వాళ్లకే వస్తున్నాయి. కొవిడ్ కారణంగా కొన్ని బిల్లులు పెండింగ్ పడటం వాస్తవమే. ఇటీవల ఉపాధిహామీ బిల్లులు కట్టాం. మిగిలినవీ కడతాం’ అని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
‘నవరత్నాలు - ప్రత్యక్ష నగదు బదిలీ’ (డీబీటీ)పై తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి బుగ్గన మాట్లాడారు. ‘నవరత్నాల అమలుకు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ప్రతిపక్షాల ద్వారా విపరీతమైన దాడికి గురైన శాఖ.. ఆర్థికశాఖ. 2014లో గత ప్రభుత్వం ఏర్పడేనాటికి రాష్ట్ర అప్పు రూ.1.35 లక్షల కోట్లు. 2019కి అది రూ.3.25 లక్షల కోట్లకు చేరింది. అంటే గత ప్రభుత్వం 20% అప్పులు చేసింది. ప్రస్తుత అప్పు రూ.4.90 లక్షల కోట్లు. మనం 15 శాతమే అప్పు చేశాం.
అమ్మఒడి, విద్యాదీవెన, వసతిదీవెన, నాడు-నేడు వద్దని చెప్పగలరా? శ్రీలంకతో రాష్ట్రాన్ని పోల్చి భయపెట్టే ప్రయత్నం చేశారు. కరెంటు మీటర్ల ఏర్పాటుతో రైతులకే సబ్సిడీ వస్తుంది. దీనిపై తెదేపా అసత్యప్రచారం చేస్తోంది. కొవిడ్ సమయంలో మద్యం ధరలు పెంచాం. ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకతో పోలిస్తే మనవద్ద ధరలు తక్కువ. పోలవరాన్ని వాళ్లు చెడగొడితే, మళ్లీ కట్టేలా ప్రధానితో జగన్ మాట్లాడారు. ఈ తీర్మానాన్ని అంతా ఆమోదించాలి’ అని రాజేంద్రనాథ్‌రెడ్డి కోరారు.
రైతును రాజుగా చేస్తున్న పాలన.. ‘రైతును రాజుగా చేస్తూ జగన్ పాలన అందిస్తున్నారు. పింఛన్లు అందరికీ ఒకటో తేదీన ఇంటికే పంపిస్తున్నారు. ఇంతమందికి పదవులు ఇచ్చి, రాష్ట్రానికి వేలమంది నాయకులను అందించారు. ఇలాంటి నాయకుడిని అనేక శక్తుల నుంచి రక్షించుకోవాలి’ అని విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గిరిజనులు మూడు లక్షల ఎకరాల్లో సాగు చేసుకునేలా హక్కుపత్రాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల రూపంలో జలగల సమూహాన్ని ప్రజల్లోకి వదిలారని, ఇప్పుడు వాలంటీర్ల ద్వారా పారదర్శక పాలన అందుతోందని తెలిపారు.
పార్టీ జమాఖర్చుల నివేదిక.. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 వరకు పార్టీ జమాఖర్చుల నివేదికను ఆమోదం నిమిత్తం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ప్రతినిధుల చప్పట్లతో ఆమోదించినట్లు పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రకటించారు.
తలరాతలు మార్చిన నవరత్నాలు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
‘గత ప్లీనరీలో నవరత్నాలను ప్రకటించిన జగన్.. ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని అమలు చేస్తున్నారు. వీటివల్ల ఎన్నో కుటుంబాల తలరాతలు మారాయి. రైతులకు ఏటా రూ.13,500 చొప్పున అయిదేళ్లలో రూ.67,500 చొప్పున ఇస్తున్నాం. ఆరోగ్యశ్రీలో 2,436 జబ్బులను చేర్చారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో వైద్యకళాశాల నిర్మిస్తున్నాం. అమ్మఒడి కింద మూడేళ్లలో రూ.19,697 కోట్లు ఇచ్చాం.
గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు 39లక్షల మందికి పింఛన్లు ఇస్తే, ఇప్పుడు మనం 61 లక్షల మందికి ఇస్తున్నాం. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం బృహత్తర కార్యక్రమం. మూడు విడతల్లో మద్యనిషేధం అమలుచేస్తున్నాం. డీబీటీలో 25, నాన్ డీబీటీలో 7 కలిపి 32 పథకాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. జగన్‌ను మరోసారి సీఎంను చేసుకోవాలి.’
ఇవీ చూడండి: