ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతరకు వచ్చే ఆదాయం క్రమంగా పెరుగుతోంది. రెండేళ్లకోసారి వనం వీడి జనం చెంతకు చేరే తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మేడారం ప్రాంతమంతా జనసంద్రంగా మారుతోంది. సమ్మక్క, సారలమ్మలను దర్శించుకున్న అనంతరం భక్తులు ఎవరికి తోచినంత వారు హుండీలో కానుకలు సమర్పించుకుంటారు. ఫలితంగా ప్రతిరోజు జాతరలో భక్తుల సంఖ్య పెరిగినట్లే హుండీలో ఆదాయం కూడా పెరుగుతోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జాతరకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తూ కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తోంది. వసతులు పెరగడం వల్ల భక్తుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది.
దేశం నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి భక్తులు వచ్చి అమ్మలను దర్శించుకుంటారు. ఫలితంగా విదేశీ కరెన్సీ కూడా హుండీల్లో దర్శనమిస్తుంది. 1980 ప్రాంతంలో మేడారం హుండీ ఆదాయం నాలుగున్నర లక్షలుగా ఉండేది. అది క్రమంగా పెరుగుతూ కోట్లకు చేరింది. గతేడాది హుండీ ఆదాయం రూ.10 కోట్లకు పైమాటేనట!
భక్తులు హుండీలో సమర్పించుకునే ఆదాయంతో పాటు పుట్టు వెంట్రుకలు, ప్రత్యేక దర్శనాలు, లడ్డూ ప్రసాదం ద్వారా మరింత ఆదాయం సమకూరుతోంది.
మేడారం జాతర అనంతరం హుండీల లెక్కింపులో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తున్నందున ఈ ఏడు జాతరలో ఎంత ఆదాయం తల్లులకు చేరుతుందనే ఆసక్తి అందరిలోనూ... నెలకొంది.
- ఇవీ చూడండి: అదుపులోకి వచ్చిన ఉప్పూడిలో గ్యాస్ లీకేజీ