తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన మోహినొద్దీన్, తన భార్య ఇద్దరు పిల్లలతో సహా గ్రామ శివారులో ఉన్న కొండపోచమ్మ జలాశయానికి సంబంధించిన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లాడు. కాలువలో ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత కాలువలో ఈత కొడతానని, దాన్ని చరవాణిలో చిత్రీకరించాలని చెప్పి అందులోకి దిగాడు. తండ్రి ఈత కొడుతుండగా పిల్లలు చరవాణిలో వీడియో తీస్తున్నారు. అంతలోనే నీటి ప్రవాహం అధికం కావటం వల్ల అతడు నీటమునిగి వరద ఉద్ధృతికి కాలువలో కొట్టుకుపోయాడు.
నీటిలో మునిగిన తండ్రి చాలాసేపటి వరకూ పైకి రాకపోవటం వల్ల ఆందోళన చెందిన భార్య, పిల్లలు స్థానికులకు విషయాన్ని చెప్పారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల కాలువలోకి ఎవరూ దిగలేదు. తుక్కాపూర్ సర్జిపూల్ వద్ద కొండపోచమ్మకు నీటిని ఎత్తిపోసే మోటార్లను నిలిపివేయాలని నీటిపారుదల శాఖ అధికారులను కోరారు. బుధవారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపడుతామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట బలవన్మరణం