ఎంతో మందికి విద్య, విజ్ఞానాలు అందించి, కళలు, సంస్కృతిని పెంపొందించిన విజయనగరం పూసపాటి వంశీయుల మహారాజ పోషణ సంస్థ మాన్సాస్. అలాంటి సంస్థని జగన్ సర్కారు తమ కుతంత్ర రాజకీయాలకు వేదిక చేసుకోవడం విచారకరమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మండిపడ్డారు. ట్రస్ట్ చైర్మన్‌గా ఉన్న అశోక్‌గజపతిరాజుపై కక్ష తీర్చుకోవడానికి మాన్సాస్ పరిధిలో ఉన్న భూములు, ఆస్తుల కోసం... ట్రస్ట్‌ని జగన్ చెరబట్టారని ధ్వజమెత్తారు.
మాన్సాస్‌ని అడ్డుపెట్టుకుని క్షుద్రరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ట్రస్ట్ పరిధిలో దేవాలయాలు, విద్యాసంస్థలు లెక్కలేనన్ని ఉన్నాయని అన్నారు. అశోక్ గజపతిరాజుని చైర్మన్‌గా తొలగించినప్పటి నుంచీ ఈ సంస్థలలో పనిచేసే ఉద్యోగులకు జీతాలివ్వడం లేదని దుయ్యబట్టారు.
ఐదు నెలలుగా జీతాలివ్వడంలేదని నాన్‌టీచింగ్ స్టాఫ్ విజయనగరం వీధుల్లో భిక్షాటన చేయడం అందరిని కలచివేస్తోందన్నారు. వారు కుటుంబాలతో సహా రోడ్డున పడటానికి కారణం ముమ్మాటికీ జగన్ సర్కారేనని ఆరోపణలు చేశారు. భూములు కొట్టేసేందుకు, పదవులు అలంకరించేందుకు మాన్సాస్ ట్రస్ట్ కావాలి గానీ అందులో పనిచేసే ఉద్యోగులకు మాత్రం జీతాలివ్వక పోవడమేమిటని ట్విట్టర్ వేదికగా లోకేశ్ మండిపడ్డారు.
ఇదీ చదవండి:
గ్రామ స్వరాజ్యం గురించి సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదం: యనమల