తెలంగాణ హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి (45) దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. మంథని మండలం గుంజపడుగ గ్రామానికి చెందిన వామన్‌రావు, నాగమణి హైకోర్టులో న్యాయవాదులు. పలువురు రాజకీయ నాయకులు, పోలీసులకు వ్యతిరేకంగా అనేక కేసుల్లో వాదనలు వినిపించడంతో పాటు ఇసుక క్వారీయింగ్ వంటి అక్రమాలపై వారు హైకోర్టుకు లేఖలు రాశారు. బుధవారం ఉదయం 11 గంటలకు వారు కారు డ్రైవర్ సతీశ్‌తో కలిసి మంథని వచ్చారు. అక్కడ ఓ కేసుకు సంబంధించి దస్తావేజులు తీసుకున్నారు. మధ్యాహ్నం 1.50 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరారు. మంథని నుంచి గుర్తుతెలియని వ్యక్తులు నల్లటి కారులో వీరి వాహనాన్ని వెంబడించారు. కల్వచర్ల సమీపంలో లాయర్ కారు ముందు తమ వాహనాన్ని ఆపి అడ్డగించారు. కొబ్బరిబొండాలు నరికే కత్తులతో కారు అద్దాలు పగలగొట్టి వామన్‌రావును కిందకు లాగారు. మెడ, పొట్ట భాగంలో నరికారు. భయంతో కారులోనే ఉండిపోయిన నాగమణి మెడపైనా నరికారు. అప్పటికే రహదారిపై వాహనాలు నిలిచిపోవడం, వాహనదారులు, బస్సుల్లో ఉన్న ప్రయాణికులు అరవడంతో దుండగులు మంథని వైపు పరారయ్యారు. అక్కడున్నవారు 108 సిబ్బందికి సమాచారం అందించారు. అంబులెన్సులో బాధితులను పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు.
రక్షణ కోరినా దక్కని ప్రాణం
ప్రభుత్వ పథకాల్లో అవినీతి, అక్రమాలపై తరచూ స్పందించడం, వివాదాస్పదంగా మారిన తగాదాలను వృత్తిపరంగా వామన్‌రావు ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారే దంపతులను హతమార్చినట్లు తెలుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని వారు హైకోర్టుకు విన్నవించుకోగా రక్షణ కల్పించాల్సిందిగా న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. ఈ విషయమై ఈ దంపతులు పలుమార్లు రామగుండం సీపీ సత్యనారాయణతో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది.
ఎవరా వ్యక్తి?
పెద్దపల్లి-మంథని మార్గంలో రామగిరి మండలం కల్వచర్ల పెట్రోల్ పంపు వద్ద రహదారి పనులు జరుగుతుండటంతో అక్కడ వాహనాలు నెమ్మదిగా వెళ్తుంటాయి. దుండగులు అక్కడ లాయర్ వాహనాన్ని ఓవర్‌టేక్ చేశారు. కత్తిపోట్ల అనంతరం రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపిస్తోంది. నిందితులు దాడి అనంతరం వచ్చిన కారులోనే మంథని వైపు వెళ్లారు. అదే కారులో అంతకుముందు మంథనిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైనట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హత్యకు పాల్పడింది శ్రీనివాసేనని, గుంజపడుగుకు చెందిన మరో వ్యక్తి కూడా ఇందులో పాల్గొన్నట్లు భావిస్తున్నారు.
ఆరు ప్రత్యేక బృందాల ఏర్పాటు
సంఘటనా స్థలాన్ని క్లూస్ టీం బృందం పరిశీలించింది. మంథని మండల తెరాస అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, అతడి అనుచరులు అక్కపాక కుమార్, వసంతరావు ప్రోద్బలంతో ఈ హత్యలకు పాల్పడ్డారని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు ముగ్గురు డీసీపీలతో ఆరు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు రామగుండం సీపీ సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. గుంజపడుగులో ఓ ఇంటి నిర్మాణానికి సంబంధించి వామన్‌రావుకు, నిర్మాణదారులకు మధ్య విభేదాలున్నాయన్నాయని, అన్ని కోణాల్లోనూ విచారిన్నామని చెప్పారు.
తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసన నేడు
న్యాయవాద దంపతుల హత్యకు కారకులైన దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని తెలంగాణ హైకోర్టు బార్ అసోసియేషన్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సంఘటనకు నిరసనగా గురువారం హైకోర్టులో విధుల బహిష్కరణకు పిలుపునిచ్చింది. వామన్‌రావు దంపతుల హత్యను తెలంగాణ బార్ కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది. న్యాయవాదులపై ఇటీవల దాడులు ఎక్కువవుతున్నాయని, వారి రక్షణకు చట్టాన్ని తీసుకురావాలని కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి పేర్కొన్నారు.
తెరాస నేతల హస్తం: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు
ఈ దారుణ హత్య వెనుక తెరాసకు సంబంధించిన కొందరు నాయకుల హస్తం ఉందని మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆరోపించారు. తెరాస నాయకులు, పోలీసులే కారణమని, దానిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరారు. సంఘటన స్థలంలో ఆధారాలను పోలీసులు గాలికి వదిలేయడం అనుమానాస్పదంగా ఉందని... దీనికి రామగుండం సీపీ సత్యనారాయణ బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు, అధికారులపై ఎన్నో వ్యాజ్యాలు
లాయర్ వామన్‌రావు, నాగమణి దంపతులు పోలీసులు, అధికారులు, వారి చర్యలను సవాలు చేస్తూ కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలు చేయడంతోపాటు పలువురు పిటిషనర్ల తరఫున వాదనలు వినిపించేవారు. అధికారులకు ముఖ్యంగా పోలీసులకు వ్యతిరేకంగా ఉన్న కేసుల్లో వాదనలు వినిపించడానికి చాలామంది వీరిని న్యాయవాదులుగా నియమించుకునేవారు. గత ఏడాది మే 22న మంథని ఠాణాలో శీలం రంగయ్య అనుమానాస్పద మృతిపై నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. న్యాయస్థానం హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్‌తో విచారణ జరిపించింది. ఆ నివేదికలో రంగయ్యది ఆత్మహత్యేనని పేర్కొనడంపై నాగమణి అభ్యంతరం వ్యక్తం చేయడంతోపాటు దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తానని చెప్పారు. పోలీసుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ పిటిషన్ దాఖలు చేసిన ఆమె రామగుండం పోలీసులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. కమిషనర్ సత్యనారాయణ సహా పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, కేసు విచారణ పూర్తయ్యేవరకు బదిలీ చేయాలని కోరారు. వారికి భయపడి వాంగ్మూలం ఇవ్వడానికి ఎవరూ ముందుకురావడంలేదంటూ గత డిసెంబరులో పిటిషన్ వేశారు. వామన్‌రావు దంపతులను పోలీసు స్టేషన్లకు పిలవొద్దని హైకోర్టు అప్పట్లో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆ ఉత్తర్వులను తొలగించాలన్న ఏజీ అభ్యర్థనను కూడా తిరస్కరించింది. రామగుండం కమిషనరేట్ పరిధిలో తమపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో హైదరాబాద్‌లో ఉన్న తమను పిలిచి వేధిస్తున్నారని నాగమణి కోర్టుకు నివేదించడంతో మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడానికి హైకోర్టు నిరాకరించింది.
పుట్ట మధు కేసులోనూ కీలక పాత్ర
గతంలో తెరాస నేత పుట్ట మధు అక్రమార్జనకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్‌లోనూ లాయర్ దంపతులు కీలక పాత్ర పోషించారని తెలిసింది. మధు సతీమణి శైలజ స్థానిక ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ దాఖలైన పిటిషన్లు, బాచుపల్లి సీఐ, ఎస్సైలపై దాఖలైన మరో పిటిషన్‌లోనూ న్యాయవాదిగా వాదనలు వినిపించారు. అన్నారం బ్యారేజీ ముంపు ప్రాంతంలో వెంకటాపురంలో ఇసుక క్వారీయింగ్‌కు అనుమతిపై నాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. తక్కువధరకే కేటాయించారని, దీనివల్ల పంచాయతీకి రూ. 49 కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. వీటితోపాటు భూసేకరణను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్‌లలో వీరు న్యాయవాదులుగా ఉన్నారు.
ముళ్ల కంపల సాక్షిగా.. ఆధారాలకు రక్షణ!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య జరిగిన ప్రాంతం. నేరస్థలిలో ఆధారాల (సీన్ ఆఫ్ ఎవిడెన్స్)ను కాపాడటంలో పోలీసుల నిర్లక్ష్యానికి ఈ చిత్రమే సాక్ష్యం. హత్య జరిగినట్లు తెలుసుకొని అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలు చెదిరిపోకుండా చూడటంలో ఘోరంగా విఫలమయ్యారు. క్లూస్ టీం వచ్చే వరకు ఎవరూ అక్కడ అడుగుపెట్టకుండా, ఆధారాలు చెరిపేయకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక పోలీసులదే. ఇక్కడ మాత్రం పోలీసులు ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. రోడ్డు పక్కన ఉన్న ముళ్లకంపల్ని తీసుకొచ్చి అడ్డంగా పెట్టారు. కనీసం అక్కడికి ఎవరూ రాకుండా చూశారా? అంటే అదీ లేదు. సంఘటన గురించి తెలిసి వచ్చిన అనేకమంది యథేచ్ఛగా మృతుల కారు వద్దకు వచ్చి వెళ్తున్నా ఆపలేకపోయారు. వాస్తవానికి ‘సీన్ ఆఫ్ ఎవిడెన్స్’ చెదిరిపోకుండా ఉండేందుకు పోలీసులు సంఘటన స్థలం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలి. కాని ఇక్కడ ముళ్ల కంప వేసి చేతులు దులుపుకోవడం.. నాలుగు గంటల తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొనడం నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచింది. ‘నేరస్థలిని 3డీ ఇమేజింగ్ చేస్తాం.. అక్కడ లభించిన ఆధారాల్ని డిజిటలైజ్ చేస్తాం.. కీలకమైన ఆధారాలను కోర్టుకు సమర్పించి నిందితులకు శిక్ష పడేలా చేస్తాం..’ అని ఉన్నతాధికారులు సాధారణంగా చెప్పే మాటలు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇలా ఉండడం విశేషం.
నిందితులను గుర్తించాం.. హోంమంత్రి మహమూద్ అలీ
ఈనాడు, హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య కేసులో నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని హోంమంత్రి మహమూద్ అలీ ఒక ప్రకటనలో తెలిపారు. నిందితుల్ని ఇప్పటికే గుర్తించామన్నారు. ఈ కేసుపై డీజీపీ మహేందర్‌రెడ్డితో మాట్లాడి త్వరగా కొలిక్కి తీసుకురావాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
ఈ హత్యల వెనుక పెద్దల హస్తం: బండి సంజయ్
బర్కత్‌పుర, న్యూస్‌టుడే: వామన్‌రావు దంపతుల హత్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తముందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వ పెద్దలు, తెరాస నేతల అక్రమాలకు సంబంధించిన సమాచారం వామన్‌రావు వద్ద ఉందని.. దాన్ని చేజిక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో మనుషులనే మాయం చేశారన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు ఆందోళనలకు పూనుకుంటే భాజపా న్యాయవాద విభాగం సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు.
న్యాయ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
గాంధీభవన్, న్యూస్‌టుడే: వామన్‌రావు దంపతుల హత్యపై సీబీఐతో కానీ, సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్ చేశారు. హత్యకు తెరాస మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ బాధ్యుడని వామన్‌రావు తన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వారు తెలిపారు. నిందితులు తెరాసకే చెందినవారేనని సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
న్యాయవాదులిద్దరికి సొంతగ్రామమైన గుంజపడుగులో ఒక దేవాలయం విషయంలో కొందరితో ఇటీవల గొడవ జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. హత్యకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్లు వివరించారు.