Nagarjuna Konda: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండకు.. రెండున్నరేళ్ల విరామం తరువాత లాంచీ సర్వీసులను పర్యాటకశాఖ తిరిగి ప్రారంభించింది. భద్రతా కారణాలు, కరోనా నేపథ్యంలో లాంచీ స్టేషన్‌కే పరిమితమైన లాంచీలు... ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో నాగార్జున కొండకు పయనమయ్యాయి. సుదీర్ఘ కాలం తర్వాత లాంచీ సర్వీసులు కొండకు ప్రారంభం కావడంతో ప్రకృతి ప్రేమికులు ఎంతో ఆసక్తి చూపారు.
గుంటూరు జిల్లా విజయపురి సౌత్‌లోని లాంచీస్టేషన్ నుంచి ఎట్టకేలకు పర్యాటకులతో నాగసిరి లాంచీ నాగార్జున కొండకు పయనమైంది. చుట్టూ కొండల నడుమ నదీ విహారం చేస్తూ పర్యాటకులు ఆనందంతో కేరింతలు కొట్టారు. నాగార్జున కొండలో ఉన్న సింహళ విహార, మహా స్తూపం, శ్రీ చైత్యం, అశ్వమేధ యాగశాల, స్నాన ఘట్టం, మ్యూజియంలోని బుద్ధుడి విగ్రహం, రాతి పనిముట్లు, మట్టి కుండలను తిలకించి మైమరిచిపోయారు. లాంచీ ప్రయాణం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందని.. పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నాగార్జున కొండకు వెళ్లే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని లాంచీ స్టేషన్ అధికారులు తెలిపారు. ప్రతీ పర్యాటకుడు లైఫ్ జాకెట్లు ధరించేలా చూస్తున్నామన్నారు. నాగార్జున కొండను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సందర్శించారు. ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన బుద్ధుడి పర్యాటక ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.
పాపికొండల విహారయాత్రలో సీఎస్ సమీర్‌శర్మ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదివారం కుటుంబసభ్యులతో కలసి పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. తొలుత రాజమహేంద్రవరం నుంచి దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి చేరుకున్నారు. అక్కడ గండి పోశమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఏపీ టూరిజం బోటుపై విహారయాత్రకు వెళ్లారు.
ఇదీ చదవండి: