గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో భాగ్యనగర్ కాలనీలో ఉన్న తన భవనం అక్రమ నిర్మాణమంటూ... అధికారులు ఈనెల 20న ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ... కోడెల శివప్రసాద్ అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాన్ని విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ...ఆ భవనం పాక్షికంగా నిర్మించినదని చెప్పారు. క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకొన్నారని... ఫైలు అధికారుల వద్ద ఉందన్నారు. రాజకీయ దురుద్దేశంతో భవనాన్ని కూలగొట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జీఎంసీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ స్పందిస్తూ... పూర్తి వివరాలు కనుక్కునేందుకు విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. శుక్రవారం వరకు ఆ భవనాన్ని ఏం చేయొద్దని స్టాండింగ్ కౌన్సిల్ను న్యాయమూర్తి ఆదేశించారు.
జీవో 347ను సస్పెండ్ చేస్తూ... హైకోర్టు నిర్ణయం
కడప జిల్లా గండి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తెచ్చే నిమిత్తం జులై 31న ప్రభుత్వం జారీ చేసిన జీవో 347ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ప్రతివాదులకు నోటీసులు ఇస్తూ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దేవాదాయ చట్టం సెక్షన్ 145కి విరుద్ధంగా కడప జిల్లా చక్రాయపేట మండలం వేంపల్లి గండి శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని... తితిదే పరిధిలోకి తెచ్చేందుకు జారీచేసిన జీవోను నిలుపుదల చేయాలని కోరుతూ... నవీన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండీ...'సిమెంట్ కన్నా ఇసుక ధర పెరిగిపోయింది'