90మందికి పైగా అస్వస్థత.. రెండురోజుల వ్యవధిలో నలుగురు మృతి చెందటంతో.. కర్నూలు జిల్లా పాణ్యం, ఆదోని మండలాల్లో అతిసారం వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. పాణ్యం మండలం గోరుకల్లు గ్రామంలో వాంతులు, విరేచనాలతో.. 50మందికిపైగా తీవ్ర అస్వస్థకు గురయ్యారు. మంగళవారం హుస్సేన్, కిట్టయ్య అనే ఇద్దరు మృతి చెందగా.. బుధవారం మద్దమ్మ అనే మహిళ చికిత్సపొందుతూ మరణించారు. కలుషిత నీరు కారణంగానే ఇలా జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆదోని పట్టణంలోని అరుణజ్యోతినగర్‌లో అతిసారంతో సుమారు 40 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. రంగమ్మ అనే వృద్ధురాలు చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. విషయం తెలుసుకున్న అధికారులు తక్షణమే వైద్యశిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. పాణ్యం మాజీ MLA గౌరు చరిత.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలతో డీఎంహెచ్‌వో గిడ్డయ్య, సబ్ కలెక్టర్ కల్పనాకుమారి.. బాధిత గ్రామాల్లో పర్యటించారు. నీటిని పరీక్షించేందుకు శాంపిల్స్‌ను ప్రయోగశాలలకు పంపించామన్నారు.
కలుషిత నీటిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. అందుకే ఈ పరిస్థితి వచ్చిందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: కరోనా విజృంభణ వేళ... టీకాలు నిండుకుంటున్నాయ్..!