KA Paul on Flexies: వేల కోట్ల ప్రజా సొమ్మును తెరాస పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో నగరంలో ఎక్కడైనా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పిన కేటీఆర్.. ఇప్పుడు తెరాసకు సంబంధించిన వేల ఫ్లెక్సీలు రోడ్లపై దర్శనమిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఏ ఇతర పార్టీలు ఎందుకు ఈ విషయాన్ని ఖండించలేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాను అమెరికాలో 33 ఏళ్లు ఉండి బిల్ క్లింటన్, బిల్‌గేట్స్‌తో పాటు బిలియనీర్లను పంపించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేశానని కేఏ పాల్ వెల్లడించారు. కానీ కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతికి ఈ ఫ్లెక్సీలే రుజువు అని ఆయన ఆరోపించారు. తెరాసకు కోటి రూపాయలు లేనప్పుడు కేసీఆర్ తనను కలిస్తే.. ఆ పార్టీ కోసం తాను ప్రమోట్ చేశానని పాల్ వెల్లడించారు. నడిరోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొచ్చా?.. వేల కోట్లను వృథా చేయొచ్చా.. అని ఆయన ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేద్దామని వెళ్తే.. తనను కలవకుండా కమిషనర్‌ను కేటీఆర్ పిలిపించుకున్నారని పాల్ ఆరోపించారు.
తాను 33 ఏళ్లు అమెరికాలో ఉండి అభివృద్ధి చేయబట్టే.. వందల వేల బిలియనీర్లను ఇక్కడికి రప్పించినందుకే.. అప్పటి ముఖ్యమంత్రులు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డితో పాటు పీవీ నరసింహరావు, రాజీవ్ గాంధీ వందనాలు చెప్పారన్నారు. ప్రస్తుతం డబ్బు లేక రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మరి వీరికి ఎక్కడి నుంచి వందల వేల కోట్లు వస్తున్నాయని కేఏ పాల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మూడు డిమాండ్లు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలని పాల్ డిమాండ్ చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై 3 వేల కోట్ల రూపాయల ఫైన్ విధించి.. వారిని చట్టబద్ధంగా శిక్షించాలని పాల్ డిమాండ్ చేశారు.
వేల కోట్ల ప్రజా సొమ్మును తెరాస పార్టీ నేతలు దుర్వినియోగం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌ల అవినీతికి ఈ ఫ్లెక్సీలే రుజువు. నడిరోడ్డుపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించొచ్చా?.. వేల కోట్లను వృథా చేయొచ్చా?. ఏ ఇతర పార్టీలు ఎందుకు ఈ విషయాన్ని ఖండించలేదు. నేను ఈ సందర్భంగా మూడు డిమాండ్లు చేస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని సీఎం చేయాలి. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై 3 వేల కోట్ల రూపాయల ఫైన్ విధించాలి. వారిని చట్టప్రకారం పోలీసులు అరెస్ట్ చేసి క్షమాపణ చెప్పేవరకు వదిలేయకూడదు. -కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీ అధినేత
ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే... మన దగ్గరే విద్యుత్ కోతలు తక్కువ - మంత్రి పెద్దిరెడ్డి