జెన్‌కో థర్మల్ యూనిట్లకు అవసరమైన బొగ్గును సముద్రమార్గంలో తీసుకురావడానికి రాష్ట్రానికి ప్రత్యేక సరకు రవాణా ఓడ (వెసల్)ను కేటాయించాలని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కోరుతూ జెన్‌కో అధికారులు లేఖ రాశారు. ‘ప్రైవేటు వెసల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల నెల్లూరులోని కృష్ణపట్నం, కడపలోని రాయలసీమ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు నిర్దేశిత వ్యవధిలో అందడం లేదు. వీటికి అవసరమయ్యే బొగ్గును ఒడిశాలోని పారదీప్ నుంచి కృష్ణపట్నం ఓడరేవుకు తీసుకురావాలి. సరకు రవాణా ఓడల కొరత వల్ల రవాణా ఛార్జీలు భారీగా పెరిగాయి. టెండర్లు దక్కించుకున్న గుత్తేదార్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యేక ఓడను కేటాయిస్తే బొగ్గు కొరత సమస్య పరిష్కారమయ్యే వరకు దాన్నే వినియోగించుకుంటామని’ ఆ లేఖలో పేర్కొంది.
కృష్ణపట్నం ప్లాంట్లకు వినియోగించే బొగ్గులో 30 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. ఈ లెక్కన ఏటా సుమారు 18 లక్షల టన్నులు కావాలి. జెన్‌కో థర్మల్ యూనిట్లను బ్యాక్‌డౌన్‌లో ఉంచడంతో గత ఏడాదిగా దిగుమతి గురించి జెన్‌కో పట్టించుకోలేదు. మహానది కోల్ మైన్స్ నుంచి వచ్చే బొగ్గుతోనే ప్లాంట్లను అవసరమైనపుడు నిర్వహిస్తోంది. ప్రస్తుతం విద్యుత్‌కు తీవ్ర డిమాండ్ నేపథ్యంలో మళ్లీ విదేశీ బొగ్గు దిగుమతికి టెండర్లు పిలవాలని అధికారులు నిర్ణయించారు. గతంలో రవాణా ఛార్జీలతో కలిపి టన్ను సుమారు రూ.7 వేలకు లభించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉన్న డిమాండ్ నేపథ్యంలో టన్ను సుమారు రూ.11-12 వేలు ధర పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టెండర్ల ప్రక్రియను నిర్వహించిన తర్వాత అప్పటి అవసరాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని భావిస్తున్నారు.
* దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి బొగ్గు రావాలంటే కనీసం నెల రోజులు పడుతుంది. ఇండోనేషియా, మలేసియా నుంచి రావడానికి సుమారు రెండు వారాలు పడుతుంది. టెండరు దక్కించుకున్న సంస్థ ఎక్కడి నుంచి ఇస్తుందనే దాని ఆధారంగా బొగ్గు నిల్వలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయన్నది తెలుస్తుందని అధికారులు చెబుతున్నారు.
* బహిరంగ మార్కెట్‌లో యూనిట్ ధర పీక్ డిమాండ్ సమయంలో యూనిట్ ఇప్పటికీ రూ.8 వంతున కొంటున్నారు. అంతర్జాతీయంగా లభించే బొగ్గు ధరలను పరిగణనలోకి తీసుకున్నా జెన్‌కో యూనిట్ ఉత్పత్తి వ్యయం రూ.5 వరకు ఉంటుందని అంచనా. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకే విద్యుత్ అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుమారు 10 లక్షల టన్నుల బొగ్గు సరఫరాకు టెండర్లు పిలవాలని భావిస్తున్నారు.
* ప్రస్తుతం విజయవాడలోని వీటీపీఎస్‌లో 20,490 టన్నులు, ఆర్‌టీపీపీలో 65,470 టన్నులు, కృష్ణపట్నంలో 53,214 టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. అన్ని యూనిట్లను జెన్‌కో ఉత్పత్తిలో ఉంచింది. ప్రతి రోజూ బొగ్గు వస్తేనే ఆయా యూనిట్లు నడిచే పరిస్థితి ఉంది.
ఇదీ చదవండి: MGNREGS FOUNDS: ఉపాధి హామీ పనుల్లో.. విచ్చలవిడిగా నిధుల స్వాహా !