నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్న తన డిమాండ్‌కు ప్రభుత్వం స్పందించకపోవడంపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహించారు. ప్రత్యక్ష పోరాటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. వరితోపాటు పలు పంటలు దెబ్బ తిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారని... నేలకు పడిపోయిన పంటలు తీసుకోవడానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు రైతులకు ఉన్నాయని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
అందుకే ఎకరాకు రూ.35 వేలు పరిహారం అవసరమని తాము డిమాండ్ చేసినట్లు పవన్ చెప్పారు. తక్షణ సాయంగా రూ.10 వేలు ఇస్తే నేల వాలిన పంట తీసుకోవడానికి వెసులుబాటు వస్తుందని కోరుతున్నామని... రైతులు మనోధైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణ సాయంగా ఆ మొత్తం ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చామన్నారు. అయినా ఎలాంటి స్పందన రాలేదని... అందుకే నిరసన దీక్షకు పిలుపునిచ్చామని తెలిపారు. నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకే ఈ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: