ఇప్పటివరకూ ఏ ప్రాంత విద్యార్థి అయినా తనకు నచ్చినచోట ఇంటర్మీడియట్‌లో చేరేవాడు. ఇక నుంచి అలా కుదరదు. ఇంటర్మీడియట్ ఆన్‌లైన్ ప్రవేశాల్లో రిజర్వేషన్ల కారణంగా ఒక ప్రాంతం వారు మరో ప్రాంతానికి వెళ్లి చదువుకోవడం కష్టమవుతుంది. రాయలసీమ విద్యార్థులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని జూనియర్ కళాశాలల్లో చేరాలంటే ఇబ్బంది అవుతుంది. రిజర్వేషన్లతో స్థానికేతరులకు పరిమిత సీట్లే ఉంటాయి. దీంతో ఇప్పటికే విజయవాడ, గుంటూరు, ఇతర ప్రాంతాల్లో ఇంటర్మీడియట్‌లో చేరిన విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలుకు చెందిన ఓ విద్యార్థి విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరాడు. కళాశాలలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లవల్ల ఆ కళాశాలలో సీటు వస్తుందో.. లేదోననే ఆందోళన అతడి తల్లిదండ్రుల్లో నెలకొంది. వేర్వేరు ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరు వచ్చి ఇంటర్లో చేరిన చాలా మందిది ఇదే పరిస్థితి.
స్థానిక కోటా అమలు
ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల్లో స్థానిక, స్థానికేతర కోటా అమలు చేస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఒక రీజియన్‌గా.. శ్రీవేంకటేశ్వర వర్సిటీ పరిధిలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు ఒక రీజియన్‌గా ఉంటాయి. ఆ ప్రాంతాలవారికి స్థానిక కోటాలో 85%, ఇతరులకు 15% సీట్లు ఉంటాయి. దీంతో విద్యార్థులకు ఇతర ప్రాంతాల్లో చేరడం కష్టమవుతుంది. ఆన్‌లైన్ ప్రవేశాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యుఎస్ కోటాను సెక్షన్ (గ్రూపు) యూనిట్‌గా అమలు చేయనున్నారు. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 6%, బీసీలకు 29% రిజర్వేషన్ అమలుచేస్తారు. ఈడబ్ల్యుఎస్ కోటా కోసం సీట్లను 10శాతం పెంచుతారు. ఈడబ్ల్యుఎస్ మినహా మిగతా రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోతే వాటిని అన్ రిజర్వుడుగా మారుస్తారు.
మార్కుల మదింపులో వ్యత్యాసం
కరోనా కారణంగా పది పరీక్షలను రద్దు చేసిన విద్యాశాఖ అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు కేటాయించింది. రాష్ట్రప్రభుత్వ పరీక్షల విభాగం ఒక విధానాన్ని పాటిస్తే, సీబీఎస్‌ఈ మరో విధానాన్ని పాటించింది. ఇప్పుడు రెండు విభిన్న మదింపులతో మార్కులు పొందినవారికి సీట్ల కేటాయింపులో ఎలా న్యాయం చేస్తారనే దానిపైనా సందిగ్ధత నెలకొంది. ప్రైవేటులో ఎక్కువ మందికి 10/10 రాగా.. ప్రభుత్వ విద్యార్థులకు తక్కువగా వచ్చాయి. దీంతో వీరిద్దరి పోటీలో ప్రైవేటు వారికే అవకాశం లభిస్తుంది.
గుర్తింపులో జాప్యం..
ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యా మండలి రుసుములు వసూలు చేసినా, ఇంతవరకు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఈ నెల 13 నుంచి 23 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. దరఖాస్తు విధానం, సీట్ల కేటాయింపుపై మార్గదర్శకాలను విడుదల చేయలేదు.
ఇదీ చదవండి: గ్రామం యూనిట్‌గా టీకా పంపిణీ జరగాలి: సీఎం జగన్