Industry representatives on Power Holiday: 'మీరు చెప్పినట్లు 50 శాతం విద్యుత్తుతో పరిశ్రమలు నడిపితే.. వాటికి తాళాలు కొని వేయడానికి కూడా మా వద్ద డబ్బులుండవు. కొవిడ్ కారణంగా రెండేళ్ల పాటు కుదేలయ్యాం. ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. ఇంతలో పవర్ హాలిడే, విద్యుత్తు ఆంక్షలు విధించడం అన్యాయం. ప్రభుత్వ నిర్ణయం పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. 2014 ముందు పరిస్థితులు మళ్లీ ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఆక్వా, స్టీల్, సిమెంటు పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి' అని పలు పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యవేక్షక ఇంజినీర్ శివప్రసాద్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడలో శుక్రవారం జరిగిన వినియోగదారుల సమావేశంలో వీరు తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి ఎస్‌ఈ శివప్రసాద్‌రెడ్డి సమాధానమిస్తూ.. ఎప్పటికప్పుడు విద్యుత్తుపై సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని, ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు కుదుటపడే అవకాశాలు ఉన్నాయని, ఇది తాత్కాలికమేనని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
Industry representatives on Power Holiday: సమావేశంలో పారిశ్రామికవేత్తలు బాయన వెంకట్రావు, కె.సోమిరెడ్డి, ఎంఎస్‌ఎంఈ అసోసియేషన్ సభ్యులు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం పరిశ్రమల ప్రతినిధులు ట్రాన్స్‌కో ఎండీ శ్రీధర్‌ను కలిసి పవర్ హాలిడే వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరించారు. వ్యవసాయ అవసరాల దృష్ట్యా తప్పనిసరి పరిస్థితుల్లో పరిశ్రమలకు కోతలు విధించాల్సి వస్తోందని ఎండీ చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న సంక్షోభమని, త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇన్నేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరే : "రెండువేల మంది కార్మికులు పన్నెండేళ్ల నుంచి పగలు, రాత్రి కష్టపడితే.. గుజరాత్ కంపెనీల నుంచి తీవ్రమైన పోటీని తట్టుకుని నిలబడ్డాం. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అధిగమించాం. ఇప్పుడు ఆంక్షలు పెడితే ఒప్పందం ప్రకారం ఆర్డర్లును సకాలంలో అందించలేం. అలా జరిగితే జరిమానాలు పడతాయి. ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. ప్రభుత్వం ముందే చెప్పి ఉంటే ఆర్డర్లు తక్కువ తీసుకునేవాళ్లం. అకస్మాత్తుగా పరిమితులు విధిస్తే ఎలా? కావాలంటే యూనిట్‌కు రూ. 2 - 3 వరకు పెంచుకున్నా ఫర్వాలేదు. కానీ మాకు విద్యుత్తు ఇవ్వాల్పిందే. ఇప్పుడు మా కంపెనీ లాభ, నష్టాల గురించి ఆలోచించట్లేదు. పేరు, ప్రతిష్ఠల గురించి, ఇన్నేళ్ల మా శ్రమ గురించి ఆలోచిస్తున్నాం." - కుశలవ ఇండస్ట్రీస్ ప్రతినిధి
ఇప్పటికే ఖర్చులన్నీ పెరిగిపోయాయి : "మేం విద్యుత్తు వినియోగాన్ని తగ్గిస్తే యంత్రాలన్నీ షట్‌డౌన్ అయిపోతాయి. మాది బొగ్గు మీద ఆధారపడి పని చేసే కంపెనీ. ప్రసుత్తం బొగ్గు ధరలు పెరిగాయి. ఎగబాకుతున్న డీజిల్ ధరలతో రవాణా ఖర్చూ పెరిగిపోయింది. ఖర్చులన్నీ 20 శాతం పెరిగాయి. యూనిట్‌కు మార్కెట్ ధర కంటే ఉత్పత్తి ఖర్చు రూ.1,000 ఎక్కువ పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో 50 శాతం విద్యుత్తుతో పరిశ్రమ నడపడమంటే మా వల్ల కాదు." - స్పాంజైజ్ ఐరన్ కంపెనీ ప్రతినిధి
ఇదీ చదవండి: అప్పటి వరకూ కరెంటు కష్టాలు తప్పవు: ఇంధన శాఖ కార్యదర్శి