నైరుతి బంగాళాఖాతం ఆనుకొని ఉన్న కోస్తాంధ్ర మీదుగా ఆవరించి ఉన్న ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలియజేసింది. సముద్ర మట్టానికి 3.6 కిలో మీటర్ల ఎత్తున ఉన్న ఈ ద్రోణి కొనసాగుతోందని, కోస్తాంధ్ర నుంచి తెలంగాణ, ఛత్తీస్ఘడ్, మహారాష్ట్రలోని విధర్భ వరకూ విస్తరించి ఉందని అధికారులు వివరించారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు క్రియాశీలకంగా మారటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. ఉత్తర కోస్తాంధ్రాలో విజయనగరం, విశాఖ, శ్రీకాకుళం, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురుస్తాయనీ, రాగల రెండు రోజుల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
ఇదీ చదవండి : నెల ముందే రష్యాను పలకరించిన హిమపాతం