కరోనాను కువైట్ దీటుగా ఎదుర్కొంటోందని కువైట్ తెలుగు కళా సమితి ప్రతినిధి గున్ను రమేశ్ తెలిపారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 26 వరకూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారన్నారు. 9వ తరగతిలోపు పిల్లలకు పరీక్షలు రద్దు చేశారని, 10వ తరగతి.. ఆపై చదువులకు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
కాఫీ షాపులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లు, జీమ్‌లు, క్లబ్బులు రెండు వారాలపాటు మూసి వేయాలని కువైట్ మంత్రి మండలి నిర్ణయించిందని రమేశ్ తెలిపారు. శుక్రవారం నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలను సైతం నిలిపివేస్తున్నట్టు చెప్పారు. భారత్, ఇటలీ, చైనా తదితర ఇతర దేశాలకు ఇది వర్తిస్తుందన్నారు. కార్గో సేవలు మాత్రం కొనసాగుతాయని పేర్కొన్నారు.
కువైట్‌లో 69 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని రమేశ్ తెలిపారు. వీరిని కువైట్, సౌదీ సరిహద్దుల్లో ఉన్న ఒక రిసార్ట్‌కు తరలించారని చెప్పారు. మార్చి ఒకటో తేదీ తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల 'హోమ్ క్వారంటైన్' ప్రకటించారని పేర్కొన్నారు.
కువైట్‌లోని తెలుగు వారు సురక్షితంగా ఉన్నారని, భారత్‌లోని కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ఎవరికైనా ఏమైనా సందేహాలు, ఇబ్బందులు ఉంటే కువైట్ తెలుగు కళా సమితిని సంప్రదించాలని సూచించారు.