రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో దేశంలో వంటనూనెల ధరలు అమాంతం పెరిగాయి. ఈ ప్రభావం నూనెతో తయారు చేసే వంటకాలపై పడింది. ప్రధానంగా అల్పాహారాల ధరలపై ఎక్కువగా కనిపిస్తోంది. పూరి, దోశ, చపాతీ, వివిధ రకాల బజ్జీల ధరలు ప్లేటుకు రూ.5 నుంచి రూ 10 వరకు అదనంగా పెరిగాయి. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని పట్టణ ప్రాంతాల వరకు ఇదే పరిస్థితి. కరోనా పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమకు వంటనూనెల ధరల పెరుగుదలతో రేట్లు పెంచడం మినహా మరో మార్గం లేదని సదరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రియమవుతున్న కూరలు, కారా ఐటమ్స్, మిఠాయిలు: నూనె ధరల పెరుగుదలతో కర్రీ పాయింట్లలో వేపుళ్లు, ఇతర కూరల ధరలు సైతం పెరిగాయి. కొన్ని చోట్ల పెంచకపోయినా గతంలో కంటే తక్కువ పరిమాణంలో ఇస్తున్నారు. వంటనూనె ధరలు పెరిగిన తర్వాత గిట్టుబాటుకాకపోవడంతో వేపుడు కూరల అమ్మకాలు మానేశామని గుంటూరులోని ఓ కర్రీ పాయింట్ యజమాని పేర్కొన్నారు. ‘‘ధరలు పెంచితే జనం రావడం లేదు. అలాగని తక్కువ ధరకు ఇస్తుంటే నష్టం వస్తుంది. పాత ధరలకు తక్కువ పరిమాణంలో ఇస్తుంటే కొనుగోలుదారులు ప్రశ్నిస్తున్నారు. అందుకే అసలు వేపుడు కూరలు అమ్మడం లేదు’’ అని ఆయన తెలిపారు.
* నూనెతో తయారు చేసే మిఠాయిలు, బూందీ, మిక్చర్, చకోడీలు తదితర కారా ఐటమ్స్ ధరలు కిలోకు రూ.20 నుంచి రూ.50 వరకు పెరిగాయి. తిరుపతిలో కిలో లడ్డూ రూ.200 ఉండగా ఇప్పుడు రూ.250కు విక్రయిస్తున్నారు. మిగతా మిఠాయిలదీ అదే దారి.
* గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం కూడా ఆహార పదార్థాల ధరలపై పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.1,750 ఉండగా.. మార్చి నాటికి అది రూ.2 వేలకు చేరింది.
ఇదీ చదవండి: ప్రభుత్వ తీరుపై నిరుద్యోగుల ఆగ్రహం.. పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్