రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓట్లకు చెదలు పట్టగా.. మరికొన్నిచోట్ల బ్యాలెట్ బాక్సులు వర్షపు నీటికి తడిసిపోయాయి.
- శ్రీకాకుళం జిల్లా మందస మండలం రాంపురం 81వ బూత్‌లో 131 బ్యాలెట్‌పత్రాలకు చెద పట్టడంతో వాటిని లెక్కించలేదు. అంబుగాం ఎంపీటీసీ సెగ్మెంటులో 48 బ్యాలెట్‌పత్రాలకు చెద పట్టింది. ఆమదాలవలస మండలం కఠ్యాచార్యులపేట సెగ్మెంటులో 605 బ్యాలెట్‌పత్రాలకు చెదపట్టింది. గార మండలం బందరువానిపేట, సతివాడ ఎంపీటీసీ సెగ్మెంట్ల పరిధిలో 658 బ్యాలెట్‌పత్రాలకు చెదపట్టింది. వాటిపై గుర్తులు కనిపించడంతో లెక్కించారు. సరుబుజ్జిలి మండలానికి చెందిన శలంత్రి, రొట్టవలసకు చెందిన కొన్ని బ్యాలెట్‌పత్రాలకూ చెదపట్టింది.
- అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్లి ఎంపీటీసీ సెగ్మెంటులో ఒక బ్యాలెట్‌బాక్సుకు చెద పట్టడంతో 175 ఓట్లు వృథా అయ్యాయి. బాగున్న 418 ఓట్లను అధికారులు లెక్కించారు.
- తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం పులిమేరు సెగ్మెంటులో 301 బ్యాలెట్‌పత్రాలకు చెదలు పట్టాయి.
- కర్నూలు జిల్లా వెలుగోడు మండలం వెలుగోడు, అబ్దుల్లాపురం, గుంతకందనాలకు చెందిన బ్యాలెట్ బాక్సులు వర్షంతో తడిశాయి. డబ్బాలు తుప్పుపట్టి.. బ్యాలెట్ పత్రాలు ఒకదానికొకటి అతుక్కుపోయాయి. వీటిని ఆరబెట్టి, లెక్కించారు.
- విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం పాకలపాడులోని రెండు ఎంపీటీసీ సెగ్మెంట్లలో 3 బ్యాలెట్ బాక్సులు తడిశాయి. కొత్తయెల్లవరం సెగ్మెంటులో 2 బ్యాలెట్ బాక్సులు తడవగా, ఓట్లను ఆరబెట్టి లెక్కించారు. మాకవరపాలెం మండలం తూటిపాల సెగ్మెంటులో రెండు, బూరుగుపాలెం సెగ్మెంటులో ఒక బాక్సు తడిశాయి. అధికారులు డ్రయర్లతో బ్యాలెట్‌పత్రాలను ఆరబెట్టారు.
- కడప జిల్లా ముద్దనూరు మండలం కొర్రపాడు ఎంపీటీసీ సెగ్మెంటులో ఒక బ్యాలెట్ బాక్సులో వర్షపునీరు చేరి ఓట్ల లెక్కింపు పూర్తిగా నిలిచిపోయింది. జమ్మలమడుగు మండలం గొరిగెనూరు ఎంపీటీసీ సెగ్మెంటులోని రెండు బ్యాలెటుబాక్సుల్లో వర్షపునీరు చేరడంతో ఓట్లను లెక్కించలేదు.
- గుంటూరు జిల్లా లూథరన్ బీఈడీ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో తాడికొండ మండలం బేజాత్‌పురం ఎంపీటీసీ సెగ్మెంటుకు చెందిన మొత్తం మూడు బాక్సులూ తడిసిపోయాయి. వాటిలో బ్యాలెట్‌పత్రాలను ఆరబెట్టి లెక్కించారు. కొల్లూరు మండలం ఈపూరుపాలెం ఎంపీటీసీకి చెందిన బ్యాలెట్‌బాక్సు తడవడంతో ఆరబెట్టి ఓట్లను లెక్కించారు.
- విజయనగరం జిల్లా బాడంగి మండలం కోడూరు-2, గొల్లాది ఎంపీటీసీ సెగ్మెంట్లకు బ్యాలెట్ బాక్సుల్లోకి నీరుచేరింది. మొత్తం 732 బ్యాలెట్‌పత్రాలను ఫ్యాన్ల కింద ఆరబెట్టి లెక్కించారు.
- తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం దొరచింతలపాలెం సెగ్మెంటుకు చెందిన 7 బ్యాలెట్ బాక్సుల్లోకి వర్షపు నీరు చేరింది. మొత్తం 2,189 బ్యాలెట్‌పత్రాలు తడిశాయి. వీటిని ఆరబెట్టి గుర్తులు కనిపిస్తే లెక్కించాలని నిర్ణయించారు. కరప మండలం అరట్లకట్ట, రాజవొమ్మంగి-2 ఎంపీటీసీ బ్యాలెట్‌పత్రాలు తడిశాయి.
తాళాలు బద్దలుకొట్టి...
- నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని స్ట్రాంగ్ రూం తాళం కనిపించలేదు. తహసీల్దార్ పర్యవేక్షణలో తాళం పగలగొట్టి బ్యాలెట్ బాక్సులను బయటకు తెచ్చారు.
- విశాఖ జిల్లా పాడేరులోని స్ట్రాంగ్ రూం తాళాలు కనిపించలేదు. లెక్కింపు ఆలస్యమవుతుందని తాళం పగలగొట్టారు.
ఇదీ చదవండి..