నగరాలు, పట్టణాల్లో ఇళ్లు, వాణిజ్య ప్రాంతాల నుంచి చెత్త సేకరణ కోసం ఉద్దేశించిన పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం(CLAP program) ముసుగులో కొందరు అక్రమ వసూళ్ల(Illegal collection in clap program)కు పాల్పడుతున్నారు. ఆటోడ్రైవర్ పోస్టులు ఇప్పిస్తామని కొందరు, సూపర్‌వైజర్లు, కార్మికులుగా నియమిస్తామని ఇంకొందరు లక్షల్లో వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం, విజయవాడలో ఇప్పటికే ఇలాంటివి వెలుగులోకి వచ్చాయి. ఇంకొన్నిచోట్ల గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. ఇందులో కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో పాటు ఇతరుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబరు 1న రాష్ట్రంలో క్లాప్ కార్యక్రమం(CLAP program) ప్రారంభం కానుంది. ఇళ్లు, వాణిజ్య ప్రాంతాల నుంచి వ్యర్థాల సేకరణ, తరలింపునకు పుర, నగరపాలక సంస్థలకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 3,100 ఆటోలు అందిస్తారు. కొన్ని నగరపాలక సంస్థల్లో అదనపు పారిశుద్ధ్య కార్మికుల నియామకాలూ జరగనున్నాయి.
ఇదే అవకాశంగా భావించిన కొందరు బ్రోకర్లు ఉద్యోగాలిప్పిస్తామని(jobs fraud in CLAP) అక్రమ వసూళ్లు(employee brokers) ప్రారంభించారు. విశాఖలోని రెండు జోన్లలో 40 డ్రైవర్ పోస్టులు ఇప్పిస్తామని ఒక్కొక్కరి నుంచి రూ.1.50-2 లక్షల వరకు వసూలు చేశారన్న ఫిర్యాదులొచ్చాయి. గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లోని కొన్ని పుర, నగరపాలక సంస్థల్లోనూ డ్రైవరు పోస్టుల కోసం బేరాలు కొనసాగుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల కోసం రూ.లక్షకుపైగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ కొన్ని పట్టణాల్లో డ్రైవర్ పోస్టుకు రూ.లక్ష ధర పెట్టారు.
ఫిర్యాదు చేయండి: స్వచ్ఛాంధ్ర సంస్థ ఎండీ
డ్రైవర్లుగా, సూపర్‌వైజర్ల ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసగాళ్లపై పోలీసులకు ఫిర్యాదుచేయాలని స్వచ్ఛాంధ్ర సంస్థ ఎండీ డాక్టర్ సంపత్‌కుమార్(clap program md sampath kumar ) సూచించారు. ఈ తరహా మోసాలకు ప్రయత్నించే వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు అప్పగించాలన్నారు. ఇప్పటికే మోసపోయిన వారు సంబంధిత వ్యక్తులపై కేసులు పెట్టాలని సూచించారు.
- పారిశుద్ధ్య కార్మికుల పోస్టులు ఇప్పిస్తామని విజయవాడలో ఇటీవల కొందరు అక్రమ వసూళ్లకు తెరతీశారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధుల పాత్రపైనా ఆరోపణలొచ్చాయి. ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షలకుపైగా వసూలు చేశారన్నది అభియోగం. విషయం తెలిసిన నగరపాలక సంస్థ అధికారులు కొత్త నియామకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
- చెత్త సేకరణ ఆటోలకు డ్రైవర్ పోస్టులు ఇప్పిస్తామని విశాఖలో కొందరు వ్యక్తులు అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. ఒక్కో పోస్టుకు రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశారు. విషయం తెలిసిన అధికారులు అప్రమత్తమయ్యారు. నియామకాలు లేవని, డబ్బులిచ్చి మోసపోవద్దని సూచించారు.