ఆంధ్రప్రదేశ్ సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక పాలన అందిస్తున్నా అందులో పారదర్శకత కొరవడిందని అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నివేదిక పేర్కొంది. పాలనా వ్యవహారాల్లో అవినీతి నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం సూచనల మేరకు అధ్యయనం చేసిన ఐఐఎం అహ్మదాబాద్ పలు కీలకమైన సిఫార్సులు చేసింది. ప్రభుత్వశాఖల్లో అవినీతి నిర్మూలనకు సంస్కరణలు తీసుకురావాలని నివేదిక ఇచ్చింది. అవినీతిపై సమాచారం అందించే విజిల్ బ్లోయర్ వ్యవస్థ ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ శాఖల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహించే ఉన్నతాధికారుల పోస్టింగ్ ఏసీబీ లాంటి విభాగాలు క్లియరెన్స్ ఇచ్చాకే నియామకం జరగాలని ఐఐఎం నిపుణుల కమిటీ పేర్కొంది. ఈ బాధ్యతలు కూడా స్వల్ప కాలికంగా నిర్దుష్ట సమయం వరకే ఉండాలని స్పష్టం చేసింది.
రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన
పారదర్శకత పెంచేందుకు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు రియల్ టైమ్ లో ఉండాలని స్పష్టం చేసింది. అలాగే రికార్డులు అన్ని డిజిటలైజేషన్ చేయాలని సూచనలు ఇచ్చింది. రెవెన్యూశాఖలో అవినీతి నిర్మూలనకు కీలక ప్రతిపాదనలు చేసింది ఐఐఎం అహ్మదాబాద్. రెవెన్యూ రికార్డుల సవరణలు కారణంగా అవినీతికి ఆస్కారం కలుగుతోందని వీటిని డిజిటలైజ్ చేయాలని సూచించింది. పురపాలక శాఖలో బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బిపిఎస్) లాంటి పథకాలు పూర్తిగా రద్దు చేయాలని సిఫార్సు చేసింది. పాలనా వ్యవహారాల్లో బయటి వ్యక్తుల జోక్యం తగదని పేర్కొంది. మాఫియా, రాజకీయ నేతలతో పాటు మీడియా జోక్యాన్ని కూడా దూరం పెట్టాలని స్పష్టం చేసింది. అవినీతి నిర్మూలనకు మీడియాను కూడా దూరం పెట్టాలని సిఫార్సు చేసింది.
సిబ్బంది కొరత
ప్రజా అవసరాలు లక్ష్యంగా పరిపాలనతో పాటు బాధ్యతాయుత యంత్రాంగం, ప్రజా విశ్వాసాన్ని తిరిగి చూరగోనెలా భాగస్వామ్య ప్రభుత్వం ఉండాలని సూచన చేసింది. అవినీతిరహిత పాలనకు ఈ అంశాలు కీలకమని ఐఐఎంలో పేర్కొంది. అన్ని ప్రభుత్వ విభాగాలను సిబ్బంది కొరత వేధిస్తోందని దీర్ఘకాలంగా ఇదే స్థితి ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి 1.5 లక్షల జనాభా బాధ్యతలను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేసింది. సగటున 158 ప్రభుత్వ సేవలు ఒక్క ఉద్యోగి ద్వారా అందాల్సిన పరిస్థితి ఉన్నట్టు పేర్కొంది. ప్రతీ ఉద్యోగి నెలకు 100 దస్త్రాలను పరిష్కరిస్తున్నట్టు తెలిపింది. అవినీతి నిర్మూలనకు ఇప్పటి వరకు తీసుకుంటున్నవి కేవలం ప్రతిచర్యలు మాత్రమేనని.. అవినీతి మూలాలను పెకలించేవి కావని ఐఐఎం నివేదిక స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : 'కరోనా బాధితులకు అన్నిచోట్ల అందుబాటులో పడకలు'