Demolitions in GHMC: అనధికారిక భవనాలు, అక్రమ నిర్మాణాల విషయంలో మేడ్చల్ డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్, హెచ్ఎండీఏ యంత్రాంగం వేగం పెంచింది. పెద్ద అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఆరు వందల గజాలకు మించిన నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు.. ఈరోజు మరో 10 అక్రమ భవనాలను కూల్చివేశారు. వాటిల్లో ఐదు అంతస్తుల భవనాలు, రెండు ఎకరాల గోదాములు ఉన్నాయి. మూడు రోజుల్లో మొత్తం 33 అక్రమ నిర్మాణాలపై టాస్క్ఫోర్స్ బృందాలు చర్యలు తీసుకున్నాయి.
తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో ఐదు అక్రమ నిర్మాణాలపై, మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రెండు, శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండు, పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి చొప్పున అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నారు. ఇవాళ తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో 2.25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రెండు అక్రమ నిర్మాణాలతో పాటు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 1.20ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.
యజమానుల ఆందోళన
అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేశారు. అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చి వేయడం పట్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: