ప్రపంచ వ్యాప్తంగా ఏ అస్థిర పరిస్థితి ఏర్పడినా.. ప్రభావం పడేది బంగారం ధరపైనే. ఇప్పుడు కరోనా భయాలు కూడా పసిడి ధరను విపరీతంగా పెంచేస్తున్నాయి. హైదరాబాద్లో మూడు రోజుల్లో రూ.2 వేలకు పైగా పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధర వేగంగా పెరుగుతుందని తెలిపారు. బంగారం ధర మూడు రోజుల క్రితం రూ.42 వేలుగా ఉండేదని, ఇప్పుడు రూ.45వేలకు చేరుకుందని వెల్లడించారు.
ఇవే కారణాలా?
ప్రపంచానికి ముడిసరుకులందించే చైనాలో కొవిడ్ వైరస్ ఇప్పటికే వేల మందిని బలితీసుకుంది. దీని ప్రభావం వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల కరెన్సీల విలువల్లో పెరుగుదల లేకపోవడం వల్ల వాటిలో పెట్టుబడి పెట్టేందుకు మదుపరులు ఆసక్తి చూపడం లేదు. ఈ పరిస్థితుల దృష్ట్యా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల బంగారం ధర పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.
మరో 5 నుంచి 8 నెలల్లో రూ.55 వేలు
కరోనా వైరస్ భయాలు తొలగిపోయినట్లయితే బంగారం ధరల్లో స్థిరత్వం లేదా కొంచెం తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ లెక్కల ప్రకారం ఔన్సు బంగారం ధర ప్రస్తుతం 1,650 డాలర్లుగా ఉంది. ఐదు నుంచి ఎనిమిది నెలల్లో 2వేల డాలర్లకు చేరే అవకాశం ఉందన్న విశ్లేషణలున్నాయి. ఇదే జరిగితే బంగారం ధర రూ.55వేలు చేరుతుందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇప్పుడే కొనేయండి
కరోనా సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మొత్తం మీద బంగారం ధర సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. పసిడి కొనాలనుకునేవారు... ఇప్పుడు కొనడమే ఉత్తమమని సూచిస్తున్నారు.