రాజధాని అమరావతి పరిధిలోని 21 గ్రామాలు.. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన ద్వారా గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్నాయా ? లేదా మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ కింద కొనసాగుతున్నాయా ? అనే విషయంలో స్పష్టత ఇస్తూ.. కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. మంగళగిరి- తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటు జీవోను సవాలు చేస్తూ... తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన సీహెచ్ బుల్లిబాబు మరికొందరు వ్యవసాయదారులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
గ్రామ పంచాయతీలుగా కొనసాగుతున్న గ్రామాల్లో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ జోక్యం చేసుకోకుండా నిలువరించాలని పిటీషనర్ తరఫు న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్ వాదనలు వినిపించారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఆ గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది కాసా జగన్ మోహన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ను ఈ ఏడాది మార్చిలో ఏర్పాటు చేశామని.. ఆ 21 గ్రామాలు కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయన్నారు. ఇరువురు వాదనలు విన్న ధర్మాసనం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై కౌంటర్ వేయాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు ఇప్పటికీ ఆ గ్రామ పంచాయతీలుగా ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయనేందుకు ఆధారాలను కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్ తరపు న్యాయవాదికి స్పష్టంచేసింది.
ఇదీ చదవండి...