TS High Court on Raja Singh Arrest : గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌పై పీడీ చట్టాన్ని వినియోగించి నిర్బంధించడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. గత నెల 25న నగర పోలీసు కమిషనర్ పీడీ చట్టం కింద జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను ధ్రువీకరిస్తూ ప్రభుత్వం 26న జారీ చేసిన జీవో 1651ను కొట్టివేయాలంటూ ఎమ్మెల్యే సతీమణి టి.ఉషాబాయి పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. శాంతిభద్రతలను కాపాడటంలో వైఫల్యాన్ని తన భర్త నిర్బంధానికి కారణంగా చూపరాదని పిటిషన్‌లో ఆమె పేర్కొన్నారు.
దీనిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. వాదనలు వినిపించడానికి ఒక రోజు గడువు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది అడిగారు. అయితే కౌంటర్ దాఖలు చేయడానికి నాలుగు వారాల గడువు కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సదాశివుని ముజీబ్‌కుమార్ కోరారు. దీనికి ధర్మాసనం అనుమతించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ.. హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీసు కమిషనర్‌లకు నోటీసులు జారీ చేసింది.
ఇవీ చదవండి: