PV Ramesh Parents: వరకట్న వేధింపుల ఆరోపణతో.. విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ తల్లిదండ్రులు పెనుమాక మణి, సుబ్బారావు, సోదరి పెనుమాక అరుణలపై విజయవాడలోని పటమట పోలీసులు 2018లో నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్ ఈ నెల 19న ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన పటమట ఎస్‌హెచ్‌వో, ఫిర్యాదుదారు డి.సంధ్య (పెనుమాక సుబ్బారావు రెండో కుమారుడు పి.రాజశేఖర్‌జోషి భార్య)కు నోటీసులు జారీ చేశారు. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేశారు.
సంధ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పటమట పోలీసులు తమపై నమోదు చేసిన 498-ఏ, వరకట్న వేధింపుల కేసును రద్దు చేయాలంటూ పెనుమాక సుబ్బారావు, మణి, అరుణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారి తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ.. పెనుమాక అరుణ 2017 మే నెలలో ఆమె భర్త, సీఐడీ డీజీ పీవీ సునీల్‌కుమార్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలో సునీల్‌కుమార్ ప్రోద్బలంతోనే సంధ్యతో ఆమె భర్త, పిటిషనర్లపై పటమణ ఠాణాలో తప్పుడు కేసు పెట్టించారన్నారు. ఈ కేసును రద్దు చేయాలని పిటిషనర్లు తొలుత ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా.. సీఆర్‌పీసీ 41ఏ నిబంధనలు పాటిస్తూ దర్యాప్తు కొనసాగించాలని పోలీసులను ఆదేశించిందన్నారు. పీవీ సునీల్‌కుమార్‌పై ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలే.. సంధ్య ఫిర్యాదులోనూ ఉన్నాయన్నారు. దీన్ని బట్టి ఈ ఫిర్యాదు వెనుక సునీల్‌కుమార్ ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.
2018లో కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు పూర్తి చేయలేదన్నారు. 41-ఏ నోటీసు పేరుతో 30 నుంచి 40 మంది పోలీసులను ఉపయోగించి పిటిషనర్లను హైదరాబాద్ నుంచి తరలించేందుకు యత్నించారన్నారు. సునీల్‌కుమార్‌కు అరుణతో ఉన్న వైవాహిక వివాదాన్ని ఒత్తిడి ద్వారా పరిష్కరించుకునేందుకే ఇలా చేస్తున్నారన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లపై పటమట ఠాణాలో నమోదైన కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలువరించాలని కోరారు.
సహాయ పీపీ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు గతంలో ఇదే వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించారన్నారు. న్యాయస్థానం 41-ఏ నిబంధన పాటించాలని ఆదేశిస్తూ.. దర్యాప్తును కొనసాగించాలని స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై దాఖలైన మరో వ్యాజ్యానికి విచారణ అర్హత ఉండదన్నారు. ఏపీపీ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. పిటిషనర్లపై పటమట పోలీసులు 2018 సెప్టెంబర్ 26న నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
ఇదీ చదవండి:ఆ అధికారిణిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి: హైకోర్టు