తెదేపా నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అరెస్టు విషయంలో పోలీసులు న్యాయస్థానం ముందు ఉంచిన 41ఏ నోటీసు తదితర విషయాలపై మేజిస్ట్రేట్ సంతృప్తి చెందకపోయినా.. రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని హైకోర్టు(high court on Pattabhi bail petition) ప్రశ్నించింది. పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసుల తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) శ్రీనివాసరెడ్డిని ఆదేశించింది. బెయిలు పిటిషన్‌పై శనివారం విచారిస్తామని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత శుక్రవారం ఈ మేరకు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై దూషణల కేసులో పట్టాభిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, మేజిస్ట్రేట్ ఆయనకు నవంబరు 2 వరకు రిమాండ్ విధించారు.
శుక్రవారం హైకోర్టు ప్రారంభం కాగానే పట్టాభిరామ్ తరఫు న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు.. బెయిలు పిటిషన్‌పై అత్యవసరంగా (లంచ్‌మోషన్) విచారణ జరపాలని న్యాయమూర్తిని కోరారు. పోలీసులు నమోదు చేసిన కొన్ని సెక్షన్లు చెల్లుబాటు కావన్నారు. సీఆర్‌పీసీ 41ఏ ప్రకారం ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. 41ఏ నోటీసులో ఖాళీలపై మేజిస్ట్రేట్ అభ్యంతరం తెలిపి, వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారిని ఆదేశించారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. రిమాండ్‌లోని అంశాలతో సంతృప్తి చెందకపోయినా మేజిస్ట్రేట్ రిమాండుకు ఎలా అనుమతి ఇచ్చారని పీపీని ప్రశ్నించారు. పీపీ బదులిస్తూ రికార్డులన్నీ దిగువ కోర్టులో ఉన్నాయని, వివరాలు సమర్పించేందుకు సమయం కావాలన్నారు. అందుకు అంగీకరించిన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై శనివారం విచారణ జరుపుతామన్నారు.
రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పట్టాభి
రాజమహేంద్రవరం నేరవార్తలు, న్యూస్‌టుడే: పట్టాభిరామ్‌ను శుక్రవారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకొచ్చారు. మచిలీపట్నం జిల్లా కారాగారంలో ఉన్న పట్టాభిరామ్‌ను కొవిడ్ పరీక్ష నెగెటివ్ రావడంతో విజయవాడ పోలీసులు శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఓ వ్యానులో తీసుకొచ్చి, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం అధికారులకు అప్పగించారు.
పట్టాభిపై భోగాపురంలో కేసు
భోగాపురం, న్యూస్‌టుడే: మత్స్యకారుల మనోభావాలను దెబ్బతీసేలా తెదేపా నేత పట్టాభిరామ్ మాట్లాడారంటూ విజయనగరం జిల్లా భోగాపురం పోలీసుస్టేషన్‌లో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మైలపల్లి నర్సింహులు, చేపలకంచేరు సర్పంచి ఎ.నర్సింగరావు తదితర నాయకులు శుక్రవారం ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేశామని, వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎస్‌ఐ మహేష్ తెలిపారు.
ఇదీ చదవండి..
YCP Vs TDP: రాష్ట్రంలో హైవోల్టెజ్ రాజకీయం.. తగ్గేదేలే అంటున్న అధికార, ప్రతిపక్షం